![]() |
![]() |

తెలుగు సినిమా మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ యస్.యస్. రాజమౌళికి మన పురాణాలు, ఇతిహాసాలతో పాటు చారిత్రక కథలన్నా ఎంతో ఇష్టం. పంచమవేదం మహాభారతాన్ని ఎప్పటికైనా సినిమాగా తీయాలనేది ఆయన ప్రగాఢ కోరిక. ఆ ఇతిహాసంలోని కర్ణుని పాత్ర ఆయన బాగా ఇష్టం. అలాగే.. ఆయనను బాగా ఆకర్షించిన కథ.. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల కథ. ఇప్పటికే మన సినిమాల్లో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కనిపించింది. 'మహామంత్రి తిమ్మరుసు' చిత్రంలో ఆ పాత్రను ఎన్టీఆర్ అద్వితీయంగా పోషించారు. సోషియో ఫాంటసీ సినిమా 'ఆదిత్య 369'లో ఆ పాత్రలో బాలకృష్ణ ఆకట్టుకున్నారు.
నిజానికి 'బాహుబలి' కథ కంటే ముందే శ్రీకృష్ణదేవరాయలు కథను ప్రభాస్‌కు చెప్పారు రాజమౌళి. రాజు కాకముందు కృష్ణదేవరాయలు ఎలాంటి వీరోచిత కార్యాలు చేశారు, ఎలాంటి ఘటనలను ఎదుర్కొన్నారనేది ఆ కథ. కృష్ణదేవరాయలు రాజు కావడంతో ఆ కథ ముగుస్తుంది. ఈ కథ ప్రభాస్‌ను ఎగ్జయిట్ చేసింది కూడా. ఆ స్క్రిప్ట్‌పై రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ వర్క్ చేశారు. 60 శాతం పూర్తి చేశారు కూడా. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్‌లో రాజమౌళి ఆశించిన టెంపో రాలేదు. విజయేంద్రప్రసాద్ ఎన్ని రోజులు ట్రై చేసినా రాజమౌళి శాటిస్‌ఫై కాలేదు. దాంతో ఆ స్క్రిప్ట్‌ను పక్కనపెట్టి 'బాహుబలి' స్క్రిప్ట్‌ను బయటకు తీశారు ఆ తండ్రీకొడుకులు. అదెంత చరిత్ర సృష్టించిందో మనకు తెలుసు.
కాగా కృష్ణదేవరాయల కథను రాజమౌళి పూర్తిగా పక్కన పెట్టేయలేదని సమాచారం. ఇప్పటికీ దానిపై విజయేంద్రప్రసాద్ వర్క్ చేస్తూనే ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ స్క్రిప్ట్‌పై పూర్తి స్థాయిలో కూర్చొనే అవకాశాలను కొట్టివేయలేం. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' తర్వాత మహేశ్‌తో మూవీ ఖాయమైతే, ఆ సినిమా తర్వాత కృష్ణదేవరాయల కథను రాజమౌళి టేకప్ చేసే అవకాశాలున్నాయి.
![]() |
![]() |