![]() |
![]() |
సూపర్‌స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘శ్రీమంతుడు’ చిత్ర కథపై గత కొన్నేళ్ళుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల స్వాతి మాసపత్రికలో వచ్చిందని, దాన్ని కాపీ చేసి ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని రూపొందించారని ఆ రచయిత శరత్‌చంద్ర కోర్టుకెక్కారు. తన కథలోని సీన్ టు సీన్ కాపీ చేసి కేవలం ఊరు పేరు మాత్రం మార్చారని కోర్టుకు తెలిపారు. దీనిపై వాదోపవాదాలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు శరత్‌చంద్రకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు కొరటాల. అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది. ఫైనల్‌గా సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా, స్థానిక కోర్టులు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ ఈ విషయంలో క్రిమినల్ చర్యలు ఎదుర్కోక తప్పదని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది.
తాజాగా ఈ వివాదంపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటన వెలువరించింది. ఈ వివాదం మీద తాము స్పందించలేమని, అది కోర్టులో కేసు నడుస్తోందని, తీర్పు రాకుండా మేం ఎలాంటి కామెంట్లు చేయమని, అది చట్ట విరుద్దమని, తమకు న్యాయం, చట్టాల మీద నమ్మకం ఉందని ఆ సంస్థ అంటోంది. అయితే గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే పాయింట్ మాత్రం తమ ఐడియానే అని మైత్రి సంస్థ స్పష్టం చేస్తోంది.
మైత్రి చెబుతున్న మాట, శరత్ చెబుతున్న మాటల్లో ఎవరిది నిజం అనే కోర్టు తేల్చాల్సి ఉంది. దీనిపై శరత్‌చంద్ర ఇటీవల స్పందిస్తూ ఈ వివాదానికి తెరదించేందుకు తనకు రూ.15 లక్షలు ఇస్తానన్నారని, అయితే తాను డబ్బు ఆశించడం లేదని స్పష్టం చేశారు. ‘‘శ్రీమంతుడు’ కథను నా నవల నుంచే తీసుకున్నానని, ఆ కథ నాదేనని కొరటాల శివ అంగీకరిస్తే చాలు’ అన్నారు.
![]() |
![]() |