![]() |
![]() |

బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరోయిన్, మోడల్ పూనమ్ పాండే కన్నుమూసింది. సర్వైకల్ క్యాన్సర్(గర్భాశయ క్యాన్సర్)తో బాధపడుతున్న ఆమె గురువారం రాత్రి మృతి చెందినట్లు ఆమె సన్నిహితులు ప్రకటించారు. కేవలం 32 ఏళ్ళ వయసున్న పూనమ్.. ఇలా క్యాన్సర్ తో మరణించింది అన్న వార్తతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురైంది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పూనమ్.. 2013 లో వచ్చిన 'నషా' సినిమాతో నటిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో మెరిసింది. టీవీ, ఓటీటీ షోలలోనూ సందడి చేసింది. అలాగే తెలుగు సినిమా 'మాలిని & కో'లో ఆమె ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
పూనమ్ పాండే జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. 2011 వరల్డ్ కప్ లో ఇండియా గెలిస్తే తన దుస్తులు తొలగిస్తానని అప్పట్లో పూనమ్ ప్రకటించడం సంచలనమైంది. అలాగే సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోయే పూనమ్ పై ఎందరో విమర్శలు గుప్పించేవారు. ఆమెలాంటి తారల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శించిన వారు కూడా ఉన్నారు. పూనమ్ వైవాహిక జీవితం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. పెళ్లయిన ఏడాదికే తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించడమే కాకుండా.. అతని నుంచి విడాకులు తీసుకుంది.
![]() |
![]() |