![]() |
![]() |

ఒక హీరో నటించిన సినిమాలు చెప్పమంటే ఆయా హీరోల అభిమానులు వెంటనే చెప్పేస్తారు. కానీ ఒక దర్శకుడు చేసిన సినిమాలు చెప్పమంటే మాత్రం చాలా మంది చెప్పలేరు. కానీ పలానా దర్శకుడి సినిమాలు చెప్పమంటే మాత్రం తెలుగు ప్రేక్షకులందరు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు.ఆయనే కళాతపస్వి కె. విశ్వనాధ్.అంతలా ఆయన్ని తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. నేడు ఆయన్ని స్మరించుకునే రోజు.
కాశీనాధుని విశ్వనాధ్ గారు శివైక్యం చెంది నేటికీ సంవత్సరం అవుతుంది. సరిగ్గా ఇదే రోజున తెలుగు సినిమాని,తెలుగు సినిమా జ్ఞాపకాలని తనతో పాటే ఆయన తన లోకానికి తీసుకెళ్లారు.అమ్మ ని మమ్మీ అని పిలిచినంత మాత్రాన అమ్మ ప్రేమ స్వచ్ఛత లో మాత్రం రాజీ అనేది ఉండదని ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోనే తెలుగు సినిమా ఆధునికత ని సంతరించుకొని సరికొత్త ఒరవడిలో దూసుకుపోతున్నా కూడా విశ్వనాధ్ గారు తన పంధాలోనే సినిమాలని తీసి పండిత పామరులని మెప్పించారు. సంస్కృతి సాంప్రదాయ ప్రధానమైన సినిమాలు తెరకెక్కించి సిల్వర్ స్క్రీన్ మీద కాసుల వర్షాన్ని కురిపించి కళ సజీవం అని కూడా నిరూపించిన మేటి నగ ధీరుడు. మొదటినుంచి కూడా కథ ని నమ్ముకొని మాత్రమే ఆయన సినిమాలు తెరకెక్కించారు. ఎంత పెద్ద హీరో అయినా సరే కథ తర్వాతే అన్ని అనేవారు. ఎందుకంటే ఆయనకీ కథ పరమేశ్వర రూపంతో సమానం.అందుకనే పెద్ద హీరోలు సైతం వాళ్ళంతట వాళ్ళు అడిగి ఆయన సినిమాలో నటించేవారు. అలాగే ఎన్నో సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రలని పోషించి నటుడుగా గాను ఆయా పాత్రలకి ప్రాణ ప్రతిష్ట చేసారు.
1965 లో వచ్చిన ఆత్మగౌరవం సినిమా ద్వారా విశ్వనాధ్ గారు దర్శకుడుగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉండమ్మా బొట్టుపెడతా, శారద,సుడిగుండాలు, చెల్లలి కాపురం,ఓ సీత కథ, సీత మహాలక్ష్మి. శంకరాభరణం, సాగర సంగమం, స్వర్ణకమలం,శృతి లయాలు, శుభ సంకల్పం, స్వాతి ముత్యం,సిరివెన్నెల, స్వయం కృషి ఇలా ఎన్నో అధ్బుతమైన సినిమాలని తెరకెక్కించారు. విశ్వనాధ్ గారు ఆయన వారసులకి తన ఆస్తిని వారసత్వంగా ఇచ్చి ఉండవచ్చు.కానీ అంతకంటే గొప్ప నిధిని ఆయన తెరకెక్కించిన సినిమాల రూపంలో తెలుగు ప్రేక్షకులకి ఆయన వారసత్వంగా ఇచ్చాడు.అలాగే అయన సినిమాలంటిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే విశ్వనాధ్ గారు ప్యూర్ వెజిటేరియన్ విప్లవ కారుడు అనే విషయం చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది.
![]() |
![]() |