![]() |
![]() |

టీవీ తార కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా దేవరాజ్‌ను ప్రశ్నిస్తూ వస్తున్న పోలీసులు ఈరోజు సాయికృష్ణారెడ్డిని విచారించనున్నారు. దేవరాజ్, సాయిని ఎదురెదురుగా కూర్చోపెట్టి ప్రశ్నించనున్నట్లు సమాచారం. శ్రావణితో సన్నిహితంగా మెలగిన దేవరాజ్, సాయి.. ఒకరినొకరు నిందించుకుంటూ ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. శ్రావణి గురించి ఇద్దరూ గొడవపడ్డారనీ, కొట్టుకున్నారనీ కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా వెలుగుచూసింది.
అలాగే తనను సాయి కొట్టినట్లు శ్రావణి చెబుతన్న ఆడియో బయటకు రావడం ఈ కేసుకు కీలకం కానున్నది. "అందరి ముందూ రోడ్డు మీద కొట్టడం, రెస్టారెంట్‌లో కొట్టడం.. నన్నెందుకు కొట్టావ్?" అని సాయిని ఆమె నిలదీయడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. గతంలో దేవరాజ్‌పై శ్రావణి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో అతను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలోనే దేవరాజ్‌పై శ్రావణి కూడా సంజీవరెడ్డి నగర్ పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుకు కూడా పంపారు.
అయితే బెయిల్‌పై వచ్చిన దేవరాజ్‌తో శ్రావణి సన్నిహితంగా మెలగుతూ వచ్చింది. ఇటీవల శ్రావణి జోలికి రావద్దని దేవరాజ్‌తో సాయి ఫోన్‌లో హెచ్చరించాడు. శ్రావణి అమ్మానాన్నలు ఏడుస్తున్నారనీ, వాళ్ల ఉసురు తగులుతుందిరా అనీ చెప్పాడు. "పెద్ద మనుషులను కూర్చోపెట్టి మాట్లాడుకొని నీ పని నువ్వు చేసుకో" అని సలహా కూడా ఇచ్చాడు. "నీకు ఫ్రస్ట్రేషన్, కోపం, ఆవేశం తప్ప ఆలోచన లేదు" అని దేవరాజ్ సమాధానం ఇచ్చాడు. నువ్వు చాలా మోసం చేస్తున్నావని సాయితో అన్నాడు. "ఈ ప్రాబ్లెమ్స్ అన్నీ నీ వల్లే వచ్చాయ్, నువ్వే రెచ్చగొట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చావ్" అని ఆరోపించాడు. శ్రావణి మీద ఎందుకు చెయ్యి చేసుకున్నావ్ అని ప్రశ్నించాడు. అటు శ్రావణి, ఇటు దేవరాజ్ మాటల్ని బట్టి శ్రావణిపై సాయిరెడ్డి చేయి చేసుకున్నాడనే విషయం తెలుస్తోంది. దీనిపై పోలీసులకు సాయి ఏం సమాధానం చెప్తాడో చూడాలి.
![]() |
![]() |