![]() |
![]() |

పదిహేను సంవత్సరాల క్రితం 'భద్ర' (2005) మూవీతో డైరెక్టర్‌గా పరిచయమై, తొలి సినిమాతోటే సూపర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను, ఈ పదిహేను సంవత్సరాల్లో డైరెక్ట్ చేసింది కేవలం ఎనిమిది సినిమాలే. అయినా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పెద్ద పేరే సంపాదించుకున్నాడు. ఈ ఎనిమిది సినిమాల్లో ఐదు హిట్లున్నాయి.. భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు. 'జయ జానకి నాయక' కూడా మంచి వసూళ్లే సాధించినా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. 'దమ్ము', 'వినయ విధేయ రామ' ఫ్లాపయ్యాయి.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలకృష్ణను డైరెక్ట్ చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాపై ఆ ఇద్దరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ అయితే తమ స్టార్ కెరీర్‌ను బోయపాటి మరోసారి గట్టెక్కిస్తాడని గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. బోయపాటే డైరెక్ట్ చేసిన 'లెజెండ్' (2014) మూవీ తర్వాత బాలయ్యకు చెప్పుకోదగ్గ సినిమా లేదు. దాంతో ఆయన కెరీర్ మరోసారి డోల్‌డ్రమ్స్‌లో పడింది. ఈ నేపథ్యంలో 'సింహా'తో ఒకసారి, 'లెజెండ్'తో ఇంకోసారి బాలయ్యకు బిగ్గెస్ట్ హిట్లను అందించిన బోయపాటిపై ఇప్పుడు పెద్ద బాధ్యత పడింది.
ఒకసారి బోయపాటి సినిమాలను గమనిస్తే, ఆయన నాలుగో సినిమా 'దమ్ము', ఎనిమిదో సినిమా 'వినయ విధేయ రామ' ఫ్లాపయ్యాయి. ఫ్లాపుల తర్వాత ఆయన చేసిన సినిమాలు హిట్టవుతూ వచ్చాయి. ఆ సెంటిమెంట్ బీబీ3 మూవీకి వర్కవుట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమా మీద బోయపాటి కెరీర్ కూడా ఆధారపడి ఉంది. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా సినిమా తియ్యాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. అయితే క్యాస్టింగ్ విషయంలోనే ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
స్టార్ హీరోయిన్లలో ఎవరూ ఈ సినిమాకి పనిచేయడానికి ముందుకు రాకపోవడంతో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే విలన్ ఎంపిక కూడా ఇంతదాకా కొలిక్కిరాకపోవడం ఇబ్బందికరమే. అయినప్పటికీ తన శాయశక్తులా ఈ సినిమాని బ్లాక్‌బస్టర్‌గా నిలపాలని కృషి చేస్తున్నాడు బోయపాటి. ఆయన కృషి ఏ మేరకు ఫలిస్తుందో, బాలయ్య కెరీర్‌ను ఈ సినిమా ఎలా నిలబెడుతుందో చూడాలి.
![]() |
![]() |