![]() |
![]() |

దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. కథానాయకులను, క్యారెక్టర్ ఆర్టిస్టులను, సాంకేతిక నిపుణులను పదే పదే పునరావృతం చేయడం. అయితే ఎటొచ్చీ కథానాయికలకు మాత్రం ఈ అంశంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు జక్కన్న.
కాకపోతే 'బాహుబలి' సిరీస్ నుంచి ఈ శైలిని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తన రెండో చిత్రం ‘సింహాద్రి’లో “చిన్నదమ్మే చీకులు కావాలా” అంటూ ప్రత్యేక గీతంలో చిందులేసిన రమ్యకృష్ణని ‘బాహుబలి’ సిరీస్ కోసం రిపీట్ చేయడమే కాకుండా.. రాజమాత శివగామిగా పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పవర్‌ఫుల్ రోల్‌లో చూపించాడు జక్కన్న. ఇక అదే సినిమాలో దేవసేనగా దర్శనమిచ్చిన అనుష్క.. అంతకంటే ముందు రాజమౌళి అయిదో చిత్రం 'విక్రమార్కుడు'లో తన గ్లామర్‌తో అప్పటి యూత్‌ని థియేటర్ల వైపు పరుగులు పెట్టించింది. కట్ చేస్తే.. ‘బాహుబలి’ సిరీస్‌లో అందుకు భిన్నంగా అభినయానికి అవకాశమున్న దేవసేన పాత్రలో ఒదిగిపోయింది.
కాగా రమ్యకృష్ణ, అనుష్క తరహాలోనే ఒకప్పుడు తన సినిమాలో గ్లామర్‌తో మెప్పించిన మరో టాలెంటెడ్ బ్యూటీని కూడా.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లో పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర కోసం ఎంచుకున్నాడు జక్కన్న. ఆ నాయిక మరెవరో కాదు.. శ్రియ. రాజమౌళి నాలుగో సినిమా 'ఛత్రపతి'లో తన ఒంపుసొంపులతో కవ్వించిన శ్రియ.. పాన్ ఇండియా మల్టీస్టారర్ 'ఆర్ ఆర్ ఆర్'(రౌద్రం రణం రుధిరం)లో పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌కి గురువుగా కనిపించనున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌కి జోడీగా శ్రియ నటిస్తోంది. అజయ్ దేవగణ్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో శ్రియ దర్శనమిస్తుందని.. ఇందులో ఆమె పాత్ర తాలూకు సన్నివేశాలు ఉద్వేగభరితంగా ఉంటాయని సమాచారం.
మరి.. రమ్యకృష్ణ, అనుష్క తరహాలోనే శ్రియ కూడా గుర్తుండిపోయే పాత్రతో మెప్పిస్తుందేమో చూడాలి. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |