![]() |
![]() |

మైత్రీ మూవీ మేకర్స్.. తెలుగునాట అనతికాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన ప్రొడక్షన్ హౌస్. ఒకవైపు అగ్ర కథానాయకులతోనూ, మరోవైపు యువ కథానాయకులతోనూ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది మైత్రీ మూవీ మేకర్స్. ఆరంభంలో ‘శ్రీమంతుడు’(2015), ‘జనతా గ్యారేజ్’(2016), ‘రంగస్థలం’(2018).. ఇలా హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ సంస్థ. అయితే ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయింది. తదనంతరం వచ్చిన సినిమాల్లో మీడియం బడ్జెట్ మూవీ ‘చిత్రలహరి’(2019), లోబడ్జెట్ ఫిలిమ్ ‘మత్తువదలరా’(2019) చెప్పుకోదగ్గ ఫలితాలను చూశాయి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ‘మత్తువదలరా’ మినహాయిస్తే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి దక్కిన ప్రతీ విజయంలో టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ వాటా కూడా ఉంది. ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘చిత్రలహరి’.. ఇలా ఈ చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ కావడంలో డీఎస్పీదే కీలకపాత్ర. అలాంటి మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. అదే.. ‘ఉప్పెన’. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, ‘సుప్రీమ్’ హీరో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేయడంతో సర్వత్రా మంచి అంచనాలే నెలకొన్నాయి.
వాస్తవానికి ‘ఉప్పెన’ని ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా తప్పలేదు. ఈ క్రమంలోనే పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాక ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నారు మేకర్స్. మరి.. మైత్రీ మూవీ మేకర్స్‌కి దేవిశ్రీ బాణీలందించిన ప్రతీ సందర్భంలోనూ విజయం వరించిన వైనం.. ‘ఉప్పెన’కి కూడా కొనసాగుతుందేమో చూడాలి.
![]() |
![]() |