![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం దేశమంతా అత్యంత క్యూరియాసిటీతో ఎదురుచూస్తోంది. ఈ మూవీలో అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియ, సముద్రకని, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ లాంటి నటీనటులు నటిస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు కానీ, అప్పటికి రాదనీ, 2022 జనవరి మొదటి వారంలో విడుదల కావచ్చనీ భావిస్తున్నారు.
కాగా, 'ఆర్ఆర్ఆర్' సెట్స్‌లో రామ్‌చరణ్ ఏడ్చేశాడనీ, దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అనీ ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసిన సుజాత అనే నటి వెల్లడించింది. టీవీ ఆర్టిస్ట్ అయిన ఆమె ఈ మూవీలో ఓ కాలనీలో నివాసం ఉండే గృహిణిగా నటించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన దాని ప్రకారం ఒక సీన్‌లో తారక్‌ను కొరడాతో కొడతాడు చరణ్. అలా కొట్టినప్పుడు తారక్‌కు దెబ్బ తగిలిందేమోనని చరణ్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఆ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే కదా! సీన్ అవగానే తారక్‌ను హగ్ చేసుకున్న చరణ్, "సారీ.. సారీ" అని చెప్పాడు. అది చూసి, చరణ్ ఇంత సెన్సిటివా అని అప్పుడు సెట్స్ మీదున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు.
అప్పుడే అక్కడ అనుకోని ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. తారక్‌ను కొరడాతో కొట్టడానికి రెండడుగులు వెనక్కి వెళ్లి, విసురుగా ముందుకు వచ్చి కొరడాతో కొట్టాలి. ఆ సీన్‌ను ఓ స్టేజి మీద చిత్రీకరిస్తున్నారు. చరణ్ రెండడుగులు వెనక్కి వేసి, స్టేజి అంచుమీద కాలు వేశాడు. అంతే.. అంతెత్తు నుంచి జారి, కింద నేలమీద పడ్డాడు. ఒక్కసారిగా అందరూ ఆందోళనపడ్డారు, చరణ్‌కు ఏమైందోనని. గబగబా ఆయన దగ్గరకు వచ్చి, పైకి లేవదీశారు. అప్పుడు చరణ్ కాలు బెణికింది. అలా ఉన్నా కూడా మళ్లీ షూట్‌ను కంటిన్యూ చేశాడు చరణ్. ఈ వివరాలను నటి సుజాత వెల్లడించింది.
'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. చరిత్రలోని ఆ వీరులను కల్పిత పాత్రలుగా మలచి 1920 నాటి నేపథ్యంతో ఈ సినిమాని రాజమౌళి తీస్తున్నారు.
![]() |
![]() |