![]() |
![]() |
.jpg)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోసం ఎందుకు బిల్డింగ్ కొన్నారు, తర్వాత ఎందుకు అమ్మారు? అంటూ ఇటీవల జూమ్ ద్వారా జరిగిన మా మీటింగ్‌లో మోహన్‌బాబు అడిగిన విషయం బయటకు వచ్చింది. ఆయన ఎవరినీ వేలెత్తి చూపకపోయినా, బిల్డింగ్ కొన్నది నాగబాబు 'మా' ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కాబట్టి, ఆయనను అడిగినట్లే! అయితే ఈ వ్యవహారాన్ని 'మా' మీటింగ్‌లో అడిగారు కానీ, పబ్లిగ్గా అడగలేదు మోహన్‌బాబు. అయినప్పటికీ మోహన్‌బాబు జూమ్ మీటింగ్‌లో అడిగిన విషయం పబ్లిక్ అయ్యింది కాబట్టి, తాను పబ్లిగ్గానే సమాధానం చెప్పాలనుకున్నారు నాగబాబు. ఒక వీడియో ద్వారా ఆయన మోహన్‌బాబు ప్రశ్నకు సమాధానం చెప్పడానికి యత్నించారు. ఇంతకాలమూ మౌనంగా ఉండి, ఇప్పుడే ఆ విషయం మోహన్‌బాబు ప్రస్తావించడానికి కారణం 'మా' ఎన్నికలంటూ ఆయనను దెప్పిపొడవడానికి ప్రయత్నించారు నాగబాబు. మోహన్‌బాబును ఒకవైపు పెద్దమనిషి అంటూనే ఆయనను టార్గెట్ చేసుకొని మాట్లాడారు. "ఎవరో కౌన్ కిస్కా గొట్టంగాడు అడిగుంటే నేను పట్టించుకొనేవాడ్ని కాను. కానీ మోహన్‌బాబు లాంటి పెద్దమనిషి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది." అని కూడా అన్నారు. అంటే, మోహన్‌బాబు కాకుండా ఇంకెవరడిగినా నాగబాబు దృష్టిలో వాళ్లు కౌన్ కిస్కా గొట్టంగాడి కిందే లెక్కనా అని యాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు.
"నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు 2006-08 కాలంలో మా అసోసియేషన్ కోసం ఒక బిల్డింగ్ కొన్నాం. ఆ తర్వాత నుంచీ మా కోసం బిల్డింగ్ కొన్నారు, తర్వాత అమ్మారు అంటూ ఎత్తిచూపిస్తూ వస్తున్నారు. ఇటీవల మా అసోసియేషన్‌కు సంబంధించి జూమ్ మీటింగ్ జరిగింది. అందులో ఏం మాట్లాడుకున్నదీ బయటకు రాకూడదు. కానీ అందులోని వివరాలు బయటకు వచ్చాయి. ఆ మీటింగ్‌లో మోహన్‌బాబు మాట్లాడుతూ, మా అసోసియేషన్ కోసం బిల్డింగ్ ఎందుకు కొన్నారు, ఆ తర్వాత ఎందుకు అమ్మారు, డబ్బులు వేస్టయిపోయాయి అంటూ మాట్లాడారు. ఆయన నాపేరెత్తలేదు. ఆయన తీవ్రంగానే విమర్శించారు. అందులో తప్పేం లేదు. ఇండస్ట్రీలో మోహన్‌బాబు ఒక పెద్దమనిషి. ఆయన అడగడంలో తప్పు లేదు. కానీ ఆయన నేను పనిచేసిన కాలంలోనే ఈ విషయం అడిగుంటే బాగుండేది. ఆయన కొంచెం లేటుగా అడిగారు. బహుశా ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అందులో భాగంగా అడిగుంటారు. పద్నాలుగేళ్ల తర్వాత ఆయన ఈ విషయం ప్రస్తావించారు. మా ఎలక్షన్స్‌లో ఆయన మంచు విష్ణును సపోర్ట్ చేస్తున్నారు. ఎవరో కౌన్ కిస్కా గొట్టంగాడు అడిగుంటే నేను పట్టించుకొనేవాడ్ని కాను. కానీ మోహన్‌బాబు లాంటి పెద్దమనిషి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది." అని అన్నారు నాగబాబు.
మోహన్‌బాబు తన పేరెత్తకపోయినా తను సమాధానం చెప్తున్నానన్నారు. "మోహన్‌బాబుగారూ ఇది మీ కోసమే. నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు మా ఆఫీస్ ఖాళీ చెయ్యమని ఫిల్మ్‌చాంబర్ వాళ్లు ఒత్తిడి చేశారు. ప్రతి మూడు నెలలకోసారి ఆ ఒత్తిడిని మేం అనుభవిస్తూ వచ్చాం. అప్పుడు క్రికెట్ మ్యాచ్‌లు ఆడినప్పుడు వచ్చిన ఫండ్ రూ. 87 లక్షలు ఉంది. అంతకు ముందు రూ. 40 లక్షల నిధులున్నాయి. మేం బాధ్యత తీసుకున్నప్పుడు రూ. 125 లక్షల నుంచి రూ. 130 లక్షల దాకా ఫండ్ ఉంది. దానిపై ఇన్‌కమ్‌టాక్స్ కడుతూ వచ్చాం. మా కోసం బిల్డింగ్ కట్టేపనైతే టాక్స్ కట్టాల్సిన పని ఉండదని ఆడిటర్ చెబితే, ఒక బిల్డింగ్ కొన్నాం. ఇంటీరియర్ డిజైన్‌తో కలిపి, ఆ బిల్డింగ్ కోసం మేం పెట్టిన ఖర్చు రూ. 90 లక్షల 46 వేలు. ఇదంతా జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్స్‌లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా చేసినవే కానీ, వ్యక్తిగతంగా చేసినవి కావు." అని నాగబాబు చెప్పారు
ఆయన టర్మ్ 2008లో అయిపోయాక, మా ప్రెసిడెంట్‌గా మురళీమోహన్‌గారు వచ్చారు. "అప్పట్నుంచీ కూడా బిల్డింగ్ ఎందుకు కొన్నారు, డబ్బులు వేస్ట్ చేశారంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. నా టర్మ్ అయిపోయిన దగ్గర్నుంచీ మా కార్యకలాపాలకు నేను దూరంగా ఉంటూ వస్తున్నా. 2017లో ప్రెసిడెంట్‌గా శివాజీరాజా, సెక్రటరీగా నరేశ్ ఉన్నప్పుడు బిల్డింగ్‌ను అమ్మడానికి బేరం పెట్టారు. మొదట రూ. 90 లక్షలని అంచనా వేసుకొని, చివరకు రూ. 35 లక్షలకు మార్కెట్‌లో బేరం పెట్టారు. అంత తక్కువకు అమ్మవద్దని మా ఆడిటర్ చెప్పినప్పటికీ, అదే రేటుకు అమ్మేశారు. అందులో రిజిస్ట్రేషన్ ఖర్చు మానే భరించి, కొనుక్కున్న వ్యక్తికి రూ. 30 లక్షల 90 వేలకు ఇచ్చేశారు. అంటే దానికి పెట్టిన అసలు ఖర్చులో రూ. 60 లక్షలకు తక్కువగా అమ్మేశారు. నాకు తెలిసి, ఈ రాతకోతలకు సంతకం పెట్టింది సెక్రటరీగా ఉన్న నరేశ్. నాకు తెలిసి ఆయన ఈ ఎన్నికల్లో మోహన్‌బాబుగారికే సపోర్ట్ చేస్తున్నారు. మీరు అడగాల్సింది నరేశ్‌నే. నేను కూడా మీ మాటను బలపరుస్తూ, నరేశ్‌ను అడుగుతున్నాను, ఎందుకు అమ్మారు? అని. ఎందుకు అమ్మాల్సి వచ్చిందో ఆయనే సమాధానం చెప్తారు. లేదంటే అప్పుడు ప్రెసిడెంట్‌గా ఉన్న శివాజీరాజాను అడగండి." అని మోహన్‌బాబుకు ఆయన సలహా ఇచ్చారు.
![]() |
![]() |