![]() |
![]() |

పరుచూరి బ్రదర్స్ అనగానే వారు రచన అందించిన ఎన్నో.. ఎన్నెన్నో సూపర్‌హిట్ సినిమాలు జ్ఞాపకమొస్తాయి. తూటాల్లాంటి మాటలతో హీరోయిజంను ఎలివేట్ చేసే వారి డైలాగ్స్ గుర్తుకొస్తాయి. అన్నదమ్ములైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణలకు పరుచూరి బ్రదర్స్ అనే స్క్రీన్ నేమ్ పెట్టించి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు. 330కి పైగా సినిమాలకు కథలు, మాటలు, స్క్రీన్‌ప్లే అందించిన ఆ వెటరన్ రైటర్స్ ప్రాభవం కొంతకాలంగా తగ్గుముఖం పట్టింది.
ఆ ఇద్దరూ నటులుగానూ పలు సినిమాల్లో నటించారు. గోపాలకృష్ణ విలన్‌గా రాణించగా, వెంకటేశ్వరరావు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ వచ్చారు. గోపాలకృష్ణ సొంత యూట్యూబ్ చానల్ పెట్టి, అందులో తన సినిమా అనుభవాలను పంచుకుంటూ, ఔత్సాహిక రచయితలకు పాఠాలు చెబుతూ వస్తున్నారు. నిన్నమొన్నటి దాకా సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన వెంకటేశ్వరరావు, ఇటీవల బయట ఎక్కడా కనిపించడం లేదు.
లేటెస్ట్‌గా ఆయనతో దిగిన రెండు ఫొటోలను డైరెక్టర్ జయంత్ పరాన్జీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ ఫొటోల్లో వెంకటేశ్వరరావును చూసి అంతా షాకైపోతున్నారు. వృద్ధాప్యం మీద పడిన ఆయన గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. బాగా సన్నబడ్డారు. ఆ ఫొటోకు, "నా గురూజీని కలిశాను! పరుచూరి వెంకటేశ్వరరావు గారు.. వయోభారానికి గురైన ఆయనను ఇలా చూడ్డం కొద్దిగా బాధనపించింది. కానీ మై గాడ్, ఆయన మైండ్ ఎప్పటిలా చాలా చురుగ్గా ఉంది!! సోదరునితో కలిసి ఆయన 300కు పైగా సినిమాలకు రాశారు! చిన్న ఎచీవ్‌మెంట్ కాదు! వాటిలో 200 పైగా బ్లాక్‌బస్టర్స్!!! లవ్ యు సార్" అని రాసుకొచ్చారు జయంత్.

![]() |
![]() |