![]() |
![]() |

ప్రముఖ గీత రచయిత కందికొండ (48) కన్నుమూశారు. సంగీత ప్రియులను తన పాటల మాధుర్యంలో ఓలలాడించిన ఆయన కొంత కాలం కేన్సర్‌తో బాధపడ్డారు. శనివారం పరిస్థితి విషమించి వెంగళరావు నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కేన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుని, దాని నుంచి బయటపడ్డారనుకొనే సమయానికి వెన్నెముకకు కేన్సర్ పాకింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు స్నేహితుల సాయంతో ఇటీవల వెన్నెముకకు సర్జరీ జరిగింది. అయినప్పటికీ ఆయన కోలుకోలేదు.
కందికొండ వరంగల్ జిల్లా నాగుర్లపల్లి అనే గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు కందికొండ యాదగిరి. ఇంటర్మీడియేట్ చదువుతున్న కాలంలోనే సంగీత దర్శకుడు చక్రితో ఏర్పడిన స్నేహంతో, పూరి జగన్నాథ్ రూపొందించిన 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' (2001) చిత్రంలో "మళ్లీ కూయవే గువ్వా" పాటతో ఆయన గీత రచయితగా చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ పాట పాపులర్ కావడంతో ఆయనకు వరుసగా పాటలు రాసే అవకాశాలు లభించాయి. "అలా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే" (ఇడియట్), "మధురమే మధురమే" (సత్యం), "గలగల పారుతున్న గోదారిలా", "జగడమే" (పోకిరి) లాంటి సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. చివరగా ఆయన శ్రీవిష్ణు సినిమా 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు రాశారు.
రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో వందలాది పాటలు రాసిన ఆయనకు కాన్సర్ సోకినప్పట్నుంచీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. కరోనా కాలంలో అయితే ఆయన కుటుంబ ఆర్థిక స్థితి బాగా దిగజారింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి సాయం అంది చికిత్స జరిగినా, ఆయన ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తూ వచ్చింది. కందికొండ మృతి చెందారనే వార్త చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనతో అనుబంధం ఉన్న సంగీత దర్శకులు, దర్శకులు, తోటి గీత రచయితలు, గాయనీ గాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
![]() |
![]() |