![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. వెండితెర ధోని. ‘కై పో చే’ (2013)తో కథానాయకుడిగా పరిచయమైన సుశాంత్.. తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. సినిమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఆత్మహత్యా ఉదంతంతో ఒక్కసారిగా భారతీయ చిత్ర పరిశ్రమని ఉలిక్కిపడేలా చేశాడు. ప్రస్తుతం సుశాంత్ మరణంపై రకరకాల చర్చలు, వివాదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు సుశాంత్ సినిమాలను పదేపదే చూస్తూ.. అతని అభిమానులు ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. సుశాంత్ కెరీర్‌ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే.. ఇప్పటివరకు వెండితెరపై సుశాంత్ పది చిత్రాల్లో దర్శనమివ్వగా.. వాటిలో ఐదు చిత్రాలు (కై పో చే, శుద్ధ్ దేశీ రొమాన్స్, పీకే, యం.యస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, చిచ్చోరే) విజయం సాధించాయి. ఆ ఐదింటిలో సోలో హీరోగా నటించిన మూడు చిత్రాలు వేర్వేరు సంవత్సరాల్లో ఒకే నెలలో రిలీజ్ కావడం విశేషం. 2013 సెప్టెంబర్ 6న ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ ప్రేక్షకుల ముందుకు రాగా.. 2016 సెప్టెంబర్ 30న ‘యం.యస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ జనం ముందు నిలిచింది. ఇక సుశాంత్ కెరీర్‌లో చివరి బ్లాక్‌బస్టర్ అయిన ‘చిచ్చోరే’ గత ఏడాది సెప్టెంబర్ 6న విడుదలైంది.
సో.. సెప్టెంబర్ మాసం సుశాంత్ కెరీర్‌లో మోస్ట్ మెమరబుల్ మంత్ అనే చెప్పాలి. మూడేళ్ళకోమారు ఈ నెలలో సుశాంత్ మరపురాని విజయాలను సొంతం చేసుకోవడం విశేషం. అందులో ఒకే తేదీన (సెప్టెంబర్ 6) తన కెరీర్‌లో సోలో హీరోగా తొలి, చివరి విజయాలు ఉండడం ఆసక్తికరం.
మొత్తమ్మీద సెప్టెంబర్‌ని టార్గెట్ చేసుకుని సుశాంత్ నుంచి మూడు చిత్రాలు రాగా.. ఆ మూడూ మంచి విజయం సాధించడం సుశాంత్ అభిమానులకి గుర్తుండిపోయే విషయం.
![]() |
![]() |