![]() |
![]() |

పేరుకు తమిళ కథానాయకుడే అయినా తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు కార్తీ. సూర్య తమ్ముడిగా తెలుగువారికి పరిచయమైన అతను.. అనతికాలంలోనే అన్నకు తగ్గ తమ్ముడనిపించుకున్నాడు. ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఊపిరి’, ‘ఖాకి’, ‘ఖైదీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్.
ఇదిలా ఉంటే.. ‘పరుత్తివీరన్’ (2007)తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. ఇప్పటివరకు 20 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ 20 చిత్రాలు కూడా వేర్వేరు దర్శకుల కాంబినేషన్‌లో రూపొందినవే కావడం. అలాగే ఇందులో పోషించిన పాత్రలన్నీ ఒకదానితో ఒకటి పొంతనలేనివి కావడం విశేషం. కాగా ఇన్నాళ్ళుగా దర్శకుల విషయంలో స్పెషల్ ట్రాక్ రికార్డు ఉన్న కార్తీ.. ఇప్పుడిప్పుడే ఆ బాణీని మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. రిలీజ్‌కి రెడీ అయిన ‘సుల్తాన్’ సంగతి పక్కన పెడితే.. ఆ తరువాత మాత్రం కార్తీ చిత్రాలు దర్శకుల పరంగా రిపీట్ మోడ్‌లో ఉండబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘చెలియా’ తరువాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ చేస్తున్నాడు కార్తీ. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. దీని తరువాత అతను నటించబోయే సినిమా కూడా ఆల్రెడీ పని చేసిన దర్శకుడితోనే ఉండబోతోందని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్. ‘ఖైదీ’కి సీక్వెల్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని కోలీవుడ్ టాక్. అంతేకాదు.. ఈ ఏడాది చివరిలో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని వినికిడి.
మరి.. దర్శకుల విషయంలో ట్రాక్ మారుస్తున్న కార్తీకి ఎలాంటి ఫలితాలు అందుతాయో చూడాలి.
![]() |
![]() |