![]() |
![]() |

నిర్మాత, హాస్యనటుడు బండ్ల గణేశ్ కోవిడ్ 19 పాజిటివ్‌గా వెల్లడైంది. దాంతో ఆయన హోమ్ క్వారంటైన్ అయ్యారు. అందిన సమాచారం ప్రకారం ఇటీవల ఆయన ఒక హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు కోవిడ్19 సహా కొన్ని పరీక్షలు నిర్వహించారు. అందులో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. టాలీవుడ్‌లో ఒక పేరుపొందిన వ్యక్తికి కరోనా సోకడం ఇదే ప్రథమమని అంటున్నారు. ఇప్పటివరకూ బండ్ల గణేశ్ దీనిపై స్పందించలేదు.
ఇటీవల పవన్‌కల్యాణ్ హీరోగా తను నిర్మించిన 'గబ్బర్‌సింగ్' మూవీ డైరెక్టర్ హరీశ్ శంకర్‌పై చేసిన కామెంట్స్‌తో ఆయన వివాదం సృష్టించారు. ఆ సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని హరీశ్ శంకర్ పంచుకున్నాడు. అందులో గణేశ్ పేరును ప్రస్తావించడం మరచిపోయాడు. ఆ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీశ్ కేవలం రీమేక్స్‌తోనే హిట్స్ సాధించాడనీ, ఒరిజినల్ స్టోరీస్‌తో సినిమాలు తీసినప్పుడు ఫెయిలయ్యాడంటూ కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు గణేశ్. అంతే కాదు, తాను చెప్పింది తప్పని హరీశ్ నిరూపిస్తే, ఇండస్ట్రీ వదిలేసి వెళ్తానని కూడా సవాల్ విసిరారు. 'గబ్బర్‌సింగ్' వంటి హిట్ మూవీని తానివ్వడం వల్లే హరీశ్ కెరీర్ టర్న్ అయ్యిందని కూడా ఆయన అన్నారు.
ఇక నటన విషయానికొస్తే, సంక్రాంతికి విడుదలైన మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో బ్లేడ్ బాబ్జీగా కనిపించిన గణేశ్ హాస్యాన్ని పంచారు.
![]() |
![]() |