![]() |
![]() |
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘సలార్’కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదన్న విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్, కెజిఎఫ్ సిరీస్‌తో ప్రశాంత్ నీల్‌కి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హౌస్‌ఫుల్స్ అయిపోయాయి.
ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా రిలీజ్‌కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ‘సలార్’ కోసం 2500 ప్రీమియర్ షోలను తెలుగు వారి కోసం ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. హాలీవుడ్ మూవీ ‘ఆక్వామేన్’ కూడా అదే రోజు రిలీజ్ అవుతుండడంతో ఆ పోటీని కూడా లెక్క చేయకుండా ఏకంగా 2500 షోలను ‘సలార్’ కోసం కేటాయించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలో ఒక ఇండియన్ సినిమాకి అమెరికాలో 2500 షోలను ఏర్పాటు చేసిన సందర్భం లేదు. ఆ విధంగా ‘సలార్’ రిలీజ్‌కి ముందే కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు.. ఓపెనింగ్స్ పరంగా కూడా ‘సలార్’ రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు విడుదలైన ‘డంకీ’ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. షారూక్ ఖాన్ కెరీర్‌లో ‘డంకీ’ మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇదే నిజమైతే ‘సలార్’ కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
![]() |
![]() |