![]() |
![]() |
తమిళ స్టార్ హీరో, టివికె పార్టీ అధినేత విజయ్ ప్రచార ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. కరూర్‌లో జరిగిన ఈ ర్యాలీలో భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అంతేకాదు, ఎంతోమంది గాయాల పాలయ్యారు. వారిని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు కరూర్‌లో రాజకీయ ర్యాలీ సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన చాలా దుఃఖం కలిగిస్తుందన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని, రాష్ట్రపతి తమ సందేశాలలో పేర్కొన్నారు.
మీట్ ది పీపుల్ నినాదంతో తమిళనాడు వెట్రికాగం (టీవీకే) పార్టీ అధినేత, హీరో విజయ్.. ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ శనివారం (సెప్టెంబర్ 27) నామక్కల్, కరూర్‌లలో పర్యటిస్తున్నారు. విజయ్ ప్రచార సభకు స్థల ఎంపిక, అనుమతి వ్యవహారం ప్రతివారం వివాదానికి దారి తీస్తోంది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగేనా? అన్న చర్చ బయలు దేరింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ్టి సభ జరిగింది. అయితే భారీగా వచ్చిన అభిమానులను నిర్వాహకులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. 12 గంటలకు ర్యాలీకి వస్తానని చెప్పిన విజయ్ దాదాపు 7 గంటలు ఆలస్యంగా.. అంటే సాయంత్రం 7 గంటలకు వచ్చారు. అప్పటివరకు విజయ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు తిండి, నీరు లేక అలమటించారు. దానికి తోడు విజయ్ రాగానే ఒక్కసారిగా జనం అతని దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన వారికి చికిత్సను స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి వి. సెంథిల్‌బాలాజీ, రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా. సుబ్రమణియన్‌లను సీఎం స్టాలిన్ ఆదేశించారు. తగినంత వైద్య సదుపాయాలు, వైద్యులు, అత్యవసర సంరక్షణ వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని ఇద్దరు మంత్రులను కోరారు. మరోవైపు సంఘటనాస్థలానికి చేరుకున్న సహయక బృందాలు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇంత దారుణమైన ఘటన జరిగిన తర్వాత కూడా విజయ్ తన స్పందన తెలియజేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ర్యాలీకి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితి అదుపులో లేదు అని తెలుసుకున్న విజయ్ ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా జరిగిన ఘటనతో తన గుండె బద్దలైపోయిందంటూ పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. అలాగే సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
![]() |
![]() |