![]() |
![]() |

'రౌడీ బాయ్స్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. విశాల్ కాశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి 'సెల్ఫిష్' అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్లాప్ నివ్వగా... దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. "మా ఆశిష్ 'రౌడీ బాయ్స్' చిత్రంతో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మొదటి సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాడు. సుకుమార్, నేను 'ఆర్య' సినిమాకు పనిచేశాం. ఇప్పుడంతా ప్యాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. మళ్లీ ఇన్నేళ్లకు 'సెల్ఫిష్' సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. సెల్ఫిష్ అనే ఐడియా చెప్పినప్పుడే బాగా నచ్చి సినిమా చేద్దామని కాశీకి చెప్పాను. 'రౌడీ బాయ్స్' రిలీజ్ ముందు నుంచే ఈ కథ మీద వర్కవుట్ చేశాడు. పర్పెక్ట్ గా స్టోరీ సెట్ అయ్యింది. ఆశిష్ కు మొదటి సినిమా టైలర్ మేడ్ కానీ ఈ సినిమా అతనికి ఛాలెంజ్ లాంటిది. 'సెల్ఫిష్'తో ఆశిష్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా." అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మణికందన్ ఎస్., సంగీతం: మిక్కీ జే మేయర్, ఆర్ట్: యల్లయ్య ఎస్., సాహిత్యం: చంద్రబోస్, సహ నిర్మాతలు - హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి, నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాతలు: రాజు , శిరీష్, రచన దర్శకత్వం: విశాల్ కాశీ.

![]() |
![]() |