![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన పీరియడ్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' బాక్సాఫీస్ దగ్గర అద్భుతమనదగ్గ ఫలితాన్ని సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మునుపటి బాక్సాఫీస్ రికార్డులనన్నింటినీ ఈ సినిమా బద్దలుకొట్టి, సరికొత్త రికార్డులను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మూడు వారాల్లో ఈ సినిమా తెలుగునాట ఏకంగా రూ. 261 కోట్ల షేర్‌ను సాధించడం ఏ రకంగా చూసినా అసాధారణమే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 191 కోట్ల మేర ప్రి బిజినెస్ జరుపుకుంది 'ఆర్ఆర్ఆర్'. ఇందులో తెలంగాణ వాటా రూ. 70 కోట్లు, ఆంధ్ర వాటా రూ. 84 కోట్లు, రాయలసీమ వాటా రూ. 37 కోట్లు. మూడు వారాల్లో తెలంగాణలో ఈ మూవీ రూ. 108.55 కోట్ల షేర్‌ను వసూలు చేసి, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు భారీ లాభాలను సాధించిపెట్టింది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రలో టికెట్ రేట్లు తక్కువైనప్పటికీ అక్కడ రూ. 103 కోట్లను ఈ సినిమా రాబట్టింది. రాయలసీమలో రూ. 49.52 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇలా అన్నిచోట్లా ఆర్ఆర్ఆర్ బయ్యర్లకు లాభాలను అందించింది.
మూడో వారంలో తెలుగునాట ఈ సినిమా వసూళ్లను గమనిస్తే.. శుక్రవారం ఏప్రిల్ 8 రూ. 1.75 కోట్లు, శనివారం రూ. 3.10 కోట్లు, ఆదివారం రూ. 4.71 కోట్లు, సోమవారం రూ. 81 లక్షలు, మంగళవారం రూ. 64 లక్షలు, బుధవారం రూ. 34 లక్షలు, గురువారం రూ. 96 లక్షలు వచ్చాయి. లాంగ్ వీకెండ్ కావడంతో వచ్చే మూడు రోజులు కూడా మరింత షేర్ వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
![]() |
![]() |