![]() |
![]() |

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందులను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నేడు(బుధవారం) రానా దగ్గుబాటి ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ఈడీ అధికారుల ముందు లొంగిపోవడంతో అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టారు. కెల్విన్ తెలిపిన వివరాల ఆధారంగా పలువురిని ప్రశ్నిస్తున్నారు. అలాగే కెల్విన్ సెల్ ఫోన్ లో ఉన్న పలువురి ఫోన్ నంబర్లు, వారితో జరిపిన చాటింగ్‌ను అధికారులు పరిశీలించారు.
కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పూరి, చార్మి, రకుల్, నందులు విచారణకు హాజరయ్యారు. నేడు రానా, ముమైత్ ఖాన్ లను ఈడీ అధికారులు విచారించనున్నారు.
విచారణలో భాగంగా బుధవారం ఉదయం రానా ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయన గతంలో జరిపిన అనుమానాస్పద లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |