![]() |
![]() |

రెగ్యులర్ ఫార్మాట్‌కి భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని ఏర్పరుచుకొని ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్‌వర్మ ఆ తర్వాత తన పంథా మార్చుకొని తను చేసిన సినిమాలతోనే విమర్శలు కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్‌గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో తన విచిత్రమైన పోకడలతో సోషల్ మీడియాలో అంత బ్యాడ్ అయిపోయాడు. అడపా దడపా సినిమాలు చేస్తూ సినిమాల పరంగా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే వర్మ ఇప్పుడు మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు.
ఆమధ్య కేరళకు చెందిన శ్రీలక్ష్మీ సతీష్ అనే అమ్మాయి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. కెమెరా చేతిలో పట్టుకొని శారీతో స్లో మోషన్‌లో నడిచి వస్తున్న ఆ వీడియోకి వర్మ ఫిదా అయిపోయాడు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పండి అంటూ నెటిజన్లను వేడుకున్నాడు. మొత్తానికి ఆ అమ్మాయి వివరాలు సేకరించాడు. ‘మీకు ఇష్టమైతే నా సినిమాలో నటించండి. మిమ్మల్ని హీరోయిన్‌ని చేస్తాను’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. దానికి శ్రీలక్ష్మీ కూడా సానుకూలంగా స్పందించింది. వర్మ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. డిసెంబర్ 21 ఇంటర్నేషనల్ శారీ డే. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ హీరోయిన్‌గా తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌తోపాటు టైటిల్‌ని కూడా రివీల్ చేశాడు వర్మ. ఈ సినిమా పేరు ‘శారీ’. శారీ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని వర్మ చెబుతున్నాడు.
రామ్‌గోపాల్‌వర్మ ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లను పరిచయం చేశాడు. వారిలో కొందరు లైమ్‌లైట్‌లోకి వస్తే.. మరికొందరు అడ్రస్ లేకుండా పోయారు. తాజాగా వర్మ చేతికి చిక్కిన శ్రీలక్ష్మీ సతీష్ సినిమా కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఆమెకు ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
![]() |
![]() |