![]() |
![]() |

ఇతరుల కుంపటిలో మంట రాజేసి చలి కాచుకోవడం వర్మకు అలవాటు. ప్రస్తుతం అమృత ఇంటిలో మంట రాజేశారు. 'మర్డర్' టైటిల్ పెట్టడంలో వర్మ ఎత్తుగడ ఎవరికైనా ఇట్టే పసిగట్టవచ్చు. తండ్రీకూతుళ్లు మారుతి రావు, అమృత జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తున్నానని వర్మ ప్రకటించినప్పటికీ... ప్రణయ్ హత్యే కథలో ప్రధానాంశమని అర్థమవుతోంది. తండ్రి అతి ప్రేమ అని పదే పదే చెప్పడంతో కుమార్తెను దోషిగా చూపిస్తున్నారా? అనే సందేశాలు కలుగుతున్నాయి.
ప్రణయ్ ను హత్య చేయించిన మారుతి రావు ఆత్మహత్య చేసుకోవడంతో అమృత ఒక్కరే మిగిలారు. తండ్రీకూతుళ్ల మధ్య ఏం జరిగిందనేది ఆమెకు మాత్రమే తెలుసు. పైగా, వర్మ సినిమా ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఫేక్ పోస్ట్ ఒకటి రావడంతో ఎట్టకేలకు మీడియా ముందుకు అమృత రాక తప్పలేదు. వర్మ సినిమాకు, తన జీవితానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అయితే, వర్మ మాత్రం అమృతను వదలడం లేదు. వీలైనంతగా కామెంట్ చేసి సినిమాకి కావాల్సిన పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారు.
అమృత మీడియా ముందుకొచ్చిన మరుసటి రోజు ట్విట్టర్‌లో వర్మ తన మాటల పదును పెంచారు. "అతిగా ప్రేమిస్తే... అది తీవ్రమైన ద్వేషంగా మారి, చివరకు మితిమీరిన హింసకు ఉసిగొల్పుతుంది. 'మర్డర్' కథ అతిగా మారిన ప్రేమ, ద్వేషం, హింస గురించే" అని వర్మ ట్వీట్ చేశారు. ఇందులో అమృతను మారుతి రావు అతిగా ప్రేమించాడని భావం వస్తోంది. ఇంకా "మర్డర్ సినిమా కథను వర్ణించడాని 'మారుతి రాసిన అమృత ప్రణయ గాధ' అనేది సరిగ్గా సరిపోతుంది" అని మరోసారి,"మారుతి వధించిన ప్రాణాయమృత విషాద గాథే మర్డర్" అని మరోసారి అమృతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోసారి అమృత మీడియా వచ్చి ఏదో ఒకటి చెప్పేలా చేయాలని వర్మ ప్రయత్నిస్తున్నట్టు ఉంది.
![]() |
![]() |