![]() |
![]() |

జూన్ 14న బలవన్మరణానికి పాల్పడిన బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సొంత నగరం పాట్నాలో సల్మాన్‌ఖాన్‌ను బ్యాన్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్‌లోని నెపోటిజంపై తీవ్ర విమర్శలకు దారితీయడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిహార్ రాజధాని పాట్నాలో సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్, దర్శక నిర్మాత కరణ్ జోహార్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌లను బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌లో సుశాంత్‌ను ఎదగనీయకుండా అక్కడి వారసత్వ సంస్కృతి అడ్డుకున్నదంటూ పాట్నాలోని యువత నిరసనలకు దిగుతున్నారు. ఆ వారసత్వ సంస్కృతికి సల్మాన్, కరణ్, అలియాలను చిహ్నాలుగా వారు పరిగణిస్తున్నారు.
పాట్నాలో ఉన్న సల్మాన్‌ఖాన్‌కు చెందిన బీయింగ్ హ్యూమన్ క్లాత్ స్టోర్‌కు ప్రదర్శనగా వెళ్లిన సుశాంత్ ఫ్యాన్స్ ఆ స్టోర్ మేనేజర్ చేత బలవంతంగా దాన్ని మూసేయించారు. "బిహార్‌లో సల్మాన్‌కు చెందిన దేన్నీ మేం అనుమతించం. బీయింగ్ హ్యూమన్ వస్త్రాల్ని ఈ రాష్ట్రంలో అమ్మనీయం. బిహార్‌లో సల్మాన్ నటించిన సినిమా ఏదీ ఇక విడుదల కాదు" అని సలీల్ మిశ్రా అనే సుశాంత్ వీరాభిమాని వ్యాఖ్యానించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో నటించడంపై మీ అభిప్రాయం ఏంటని ఒక పాత ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, "సుశాంత్ ఎవరు?" అంటూ సల్మాన్ ప్రశ్నించిన వీడియో వైరల్ కావడమే సల్మాన్‌పై సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. యువకుడైన సుశాంత్ జీవితం అర్ధంతరంగా ముగిసిపోవడానికి కారకుల్లో ఒకడిగా సల్మాన్‌ను బిహార్ చూస్తోంది.
![]() |
![]() |