![]() |
![]() |

రామ్‌చరణ్‌పై ఇప్పుడు మోయలేనంత భారం వచ్చి పడింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన ఆయనకు 'ఆచార్య' మూవీ బిగ్ షాక్ నిచ్చింది. తండ్రి చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'ఆచార్య'లో ఆయన కూడా సినిమాకు కీలకమైన సిద్ధ పాత్రను చేశాడు. ఆయనది విషాదాంత పాత్ర. సినిమా విడుదలయ్యాక దాన్ని కొన్న బయ్యర్లు కూడా భారీ నష్టాలతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రేక్షకుల్ని మెప్పించని 'ఆచార్య' కథకు పరిధిని దాటేసిన బడ్జెట్ తోడై, బాక్సాఫీస్ దగ్గర 'ఆచార్య' ఘోర పరాజయాన్ని చవిచూస్తే, కెరీర్‌లో మళ్లీ బీభత్సమైన హిట్ కొట్టడంతో పాటు టాప్ స్టార్ల రేసులో తాను వెనుకపడి లేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత, అవసరం ఇప్పుడు చరణ్‌పై ఉంది. సిద్ధ పాత్రలో ప్రేక్షకులు, ఫ్యాన్స్ చరణ్‌ను చూడలేకపోయారు.
ఇప్పుడు ఆయన దేశంలోని అగ్ర దర్శకుల్లో ఒకడైన శంకర్‌తో కలిసి పనిచేస్తున్నాడు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తయారవుతున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు రూ. 150 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. శంకర్-చరణ్ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసి, తనకు కాసుల వర్షం కురిపిస్తుందనే నమ్మకంతోనే ఆయన కోట్లు కుమ్మరిస్తున్నాడు. శంకర్ చాలా ఫేమస్ డైరెక్టర్ కాబట్టి, సగం బాధ్యతను ఆయన తీసుకుంటాడనే భరోసాతో చరణ్ ఉన్నాడు.
బడ్జెట్ విషయం పక్కనపెడితే, మెగాస్టార్ వారసుడు అనే ట్యాగ్ ఒకటి చరణ్ భుజాలపై మరింత బరువును మోపుతోంది. ఆ ట్యాగ్‌ను నిలబెట్టుకున్నానని 'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో చరణ్ చూపించినా, 'RC 15'తో నిలదొక్కుకొని, తద్వారా ఫ్యాన్స్‌కు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఓవైపు వారసత్వం, మరోవైపు హద్దులు దాటేస్తున్న బడ్జెట్.. వెరసి 'RC 15'తో చరణ్ ఏం చేస్తాడో చూడాలి.
![]() |
![]() |