![]() |
![]() |

యంగ్ టైగర్ యన్టీఆర్ లోని నటుణ్ణి సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రాల్లో 'టెంపర్' ఒకటి. ఇందులో పోలీసాఫీసర్ దయగా తారక్ ప్రదర్శించిన అభినయానికి నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక 'రామయ్యా వస్తావయ్యా', 'రభస' చిత్రాలతో ట్రాక్ తప్పిన యన్టీఆర్ కెరీర్.. మళ్ళీ 'టెంపర్'తోనే సక్సెస్ రూట్ లోకి రావడం విశేషం. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాకి వక్కంతం వంశీ కథను అందించారు. తారక్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, పోసాని కృష్ణమురళి, మధురిమ, సోనియా అగర్వాల్, కోవై సరళ, రమాప్రభ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి మెలోడీబ్రహ్మ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. టైటిల్ ట్రాక్ లో తారక్ నృత్యరీతులు అప్పట్లో వార్తల్లో నిలిచాయి. బండ్ల గణేశ్ నిర్మించిన 'టెంపర్'.. హిందీలో 'సింబా'గా, తమిళంలో 'అయోగ్య'గా రీమేక్ అయింది. 2015 ఫిబ్రవరి 13న విడుదలై విజయం సాధించిన 'టెంపర్'.. నేటితో ఆరు వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
![]() |
![]() |