![]() |
![]() |

తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా రాణించి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు సురేష్. 'ప్రార్థన' చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. దీనికి ఆయనే నిర్మాతగా వ్యవహరించారు. కె. విజయభాస్కర్ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. తమిళ చిత్రాల్లో లవర్ బాయ్ ఇమేజ్‌ని దక్కించుకున్న సురేష్ ఆ ముద్రని చెరిపేసుకోవడం కోసం టాలీవుడ్ బాట పట్టారు. తమిళంలో వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయనకు ఓ నటితో ఎఫైర్ వుందని అప్పట్లో ప్రచారం జరిగిందట.
ఈ విషయంపై తాజాగా వివరణ ఇచ్చారాయన. ఈటీవిలో అలీ వ్యాఖ్యాతగా ప్రసారం అవుతున్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ తన లవ్ ఎఫైర్ వెనకున్న సీక్రెట్‌లని బయటపెట్టారు. 'ఇలాంజోడింగల్' చిత్రంలో తాను ఓ హీరోయిన్‌తో కలిసి నటించానని, మరో పెయిర్‌గా కార్తీక్-రాధిక నటించారనీ, ఆ చిత్ర ప్రమోషన్ కోసం చిత్ర నిర్మాత మా ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. దాంతో తాము పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా ఓ పత్రికలోనూ రాశారన్నారు.
దీని కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, కొన్నేళ్ల పాటు ఇద్దరం మాట్లాడుకోలేదని చెప్పుకొచ్చారు. "అయితే ఆ తరువాతే తెలిసింది.. అసలు ఆ పుకారుని పుట్టించింది చిత్ర నిర్మాత కాదని, సదరు హీరోయిన్ టీమ్ అని తెలిసి షాకయ్యాను. అప్పటి నుంచి నేను ఆ హీరోయిన్‌తో మాట్లాడటం మానేశాను" అని చెప్పారు సురేష్. కానీ పదేళ్ల కాలంలో తాము ఒకరికొకరం మాట్లాడుకోకుండానే ఆరు సినిమాలు చేశామన్నారు. చాలా రోజుల తరువాత బాలకృష్ణ సినిమా షూటింగ్, తన మూవీ షూటింగ్ అవుట్ డోర్‌లో జరుగుతుండగా అక్కడ సదరు హీరోయిన్ కలిసిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటలు కలిశాయని, ఏవో మిస్అండర్‌స్టాండింగ్ వల్లే తాము మాట్లాడుకోకుండా ఉండిపోయామని ఇద్దరం రియలైజ్ అయ్యామనీ సురేష్ తన ఎఫైర్ వదంతుల వెనకున్న అసలు కథని బయటపెట్టారు. ఇంతకీ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? విజయశాంతి!
![]() |
![]() |