![]() |
![]() |

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో పలు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో `అడవి రాముడు` ఒకటి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెరీర్ గ్రాఫ్ నే మార్చివేసిన ఈ సినిమా.. కన్నడ చిత్రం `గంధదగుడి` (1973) ఆధారంగా తెరకెక్కింది. అటవీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా జయప్రద తొలిసారిగా నటించగా జయసుధ, నాగభూషణం, సత్యనారాయణ, గుమ్మడి, జగ్గయ్య, రాజబాబు, శ్రీధర్, మాడా, పండరీ బాయి, రమా ప్రభ, కవిత, బేబి రోహిణి ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. జంధ్యాల సమకూర్చిన సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలు వారిన పాటలకు స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలు కట్టారు. ``కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు``, ``ఆరేసుకోబోయి``, ``కు కు కోకిలమ్మ పెళ్ళికి``, ``అమ్మ తోడు అబ్బ తోడు``, ``ఎన్నాళ్ళకెన్నాళ్ళకు``, ``చూడరా చూడరా``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మించిన `అడవి రాముడు`.. `ఉత్తమ చిత్రం` విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డుని, `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` (ఎ. విన్సెంట్) విభాగంలో `నంది` పురస్కారాన్ని అందుకుంది. ఈ సినిమా కోసమే మొదటిసారిగా జట్టుకట్టిన ఎన్టీఆర్ - రాఘవేంద్రరావు.. ఆపై పలు విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్నారు. కాగా, 1977 ఏప్రిల్ 28న విడుదలై సంచలన విజయం సాధించిన `అడవి రాముడు`.. నేటితో 45 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |