![]() |
![]() |

క్లాసిక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్.. లోక నాయకుడు కమల్ హాసన్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ కాంబినేషన్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో `సాగర సంగమం` (1983), `స్వాతి ముత్యం` (1986) వంటి జనరంజక చిత్రాల తరువాత వచ్చిన సినిమా `శుభ సంకల్పం` (1995). గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నిర్మించిన ఈ సంగీతభరిత చిత్రంలో దాసు అనే జాలరి పాత్రలో తనదైన అభినయంతో అలరించారు కమల్. ఇందులో కమల్ హాసన్ కి జోడీగా ఆమని నటించగా ప్రియా రామన్, కె. విశ్వనాథ్, గొల్లపూడి మారుతీ రావు, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ, రాళ్ళపల్లి, సాక్షి రంగారావు, వైష్ణవి, శ్రీలక్ష్మి, మల్లికార్జున రావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
దిగ్గజ రచయితలు వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి కలం నుంచి జాలు వారిన గీతాలకు స్వరవాణి కీరవాణి బాణీలు కట్టారు. ``సీతమ్మ అందాలు``, ``హైలెస్సో హైలెస్సో``, ``హరి పాదాన``, ``చినుకులన్నీ``, ``మూడు ముళ్ళు``, ``చిరంజీవి సౌభాగ్యవతి``, ``శ్రీశైలంలో``, ``నరుడు బతుకు నటన``.. ఇలా ఇందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. `ఉత్తమ నటి` (ఆమని), `ఉత్తమ గుణచిత్ర నటుడు` (విశ్వనాథ్), `ఉత్తమ సహాయనటి` (వైష్ణవి), `ఉత్తమ గాయని` (శైలజ), `ఉత్తమ ఎడిటర్` (జి.జి. కృష్ణారావు) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `ఉత్తమ చిత్రం`, `ఉత్తమ దర్శకుడు`, `ఉత్తమ సంగీత దర్శకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకున్న `శుభ సంకల్పం`.. 1995 ఏప్రిల్ 28న విడుదలై విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 27 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |