Home  »  News  »  సౌత్ ఫిలిమ్స్ స‌క్సెస్‌తో బాలీవుడ్ డైరెక్ట‌ర్ల వెన్నులో వ‌ణుకు పుడుతోంది!

Updated : Apr 28, 2022

 

దక్షిణాది సినిమాల‌ విజయాలు బాలీవుడ్‌లోని వారిని ఎలా ప్రభావితం చేశాయో హిందీ చిత్ర పరిశ్రమ నుండి గుర్తించిన తాజా నటుడు మనోజ్ బాజ్‌పేయి. ఇటీవలి ఇంట‌ర్వ్యూలో 'KGF: చాప్టర్ 2', 'RRR', 'పుష్ప: ది రైజ్' వంటి చిత్రాల విజయం బాలీవుడ్ ద‌ర్శ‌కుల‌ "వెన్నులో వణుకు పుట్టించింది" అని ఆయ‌న చెప్పాడు. బాలీవుడ్ సినిమాల‌ కంటే ఈ సినిమాలు ఎందుకంత భారీ విజయాన్ని సాధించాయ‌నే అంశాల గురించి కూడా మ‌నోజ్‌ మాట్లాడాడు. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ద్వారా ఇటీవ‌ల ఆయ‌న దేశవ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.

మహమ్మారి అనంతర కాలంలో, అల్లు అర్జున్‌తో సుకుమార్ తీసిన‌ తెలుగు చిత్రం 'పుష్ప: ది రైజ్' హిందీ బెల్ట్‌లో ఆధిపత్యం చెలాయించే దక్షిణాది చిత్రాల ట్రెండ్‌ను ప్రారంభించింది. ఈ చిత్రం హిందీ-డబ్బింగ్ వెర్షన్ రూ. 106 కోట్లు వసూలు చేసింది. అదే విశేష‌మ‌నుకుంటే, య‌స్‌.య‌స్‌. రాజమౌళి  'RRR', యష్ నటించిన కన్నడ చిత్రం 'KGF: చాప్టర్ 2' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొత్త పుంతలు తొక్కాయి. ఈ రెండు చిత్రాల హిందీ వెర్షన్‌లు ఒక్కొక్కటి రూ. 300 కోట్లకు పైగా వసూలు చేశాయి, ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూనే ఉన్నాయి. ఇది బాలీవుడ్‌లోని చాలా మందిని కలవరపెట్టిందని డైరెక్ట‌ర్‌ రామ్ గోపాల్ వర్మ సహా పలువురు వ్యాఖ్యానించారు.

ఈ దక్షిణాది చిత్రాల విజయం గురించి ఢిల్లీ టైమ్స్‌తో మాట్లాడుతూ, "ఇత్నీ బ్లాక్‌బస్టర్ హో రహీ హై (చాలా బ్లాక్‌బస్టర్‌లు ఉన్నాయి)... ఒక్క నిమిషం మనోజ్ బాజ్‌పేయిని, నాలాంటి వారిని మరచిపోండి. ముంబై చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రధాన స్రవంతి ఫిల్మ్‌మేక‌ర్స్ వెన్నులో అది వ‌ణుకు పుట్టించింది. నిజంగా ఎటువైపు చూడాలో తెలియడం లేదు." అని అన్నాడు మనోజ్ బాజ్‌పేయి.

'సూర్యవంశీ' వంటి పెద్ద బిడ్జెట్ హిందీ చిత్రాలు భార‌త్‌లో రూ. 200 కోట్ల‌ను చేరుకోవడానికి కష్టపడుతుంటే, హిందీలో డబ్ చేయబడిన 'KGF 2' లేదా 'RRR' ఎందుకు రూ. 300 కోట్లకు పైగా వసూలు చేయగలుగుతున్నాయి.. అనే దాని గురించి మనోజ్ వివరంగా మాట్లాడాడు. ఈ సినిమాల విజయం బాలీవుడ్‌కు ఒక పాఠం అని, వారు త్వరగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయ‌న అన్నాడు. 

"వారు నిష్కపటంగా, ఉద్వేగభరితంగా ఉంటారు. అంతే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ షాట్ తీస్తున్నట్లుగా వారు తీసిన ప్రతి షాట్ క‌నిపిస్తుంది. తాము ఏదైతే ఊహిస్తారో దాన్నే తీస్తారు. ప్రేక్ష‌కులకు అత్యంత గౌర‌వం ఇస్తూ తీస్తారు. వారి అభిరుచి అత్యున్నతమైనది. మీరు 'పుష్ప' లేదా 'RRR' లేదా 'KGF'ని చూస్తే, దాని మేకింగ్ నిష్కళంకమైనదిగా క‌నిపిస్తుంది. నిజానికి ప్రతి ఫ్రేమ్‌ని వారు ఒక జీవన్మరణ పరిస్థితిగా భావించి చిత్రీకరించారు. మనలో లేనిది ఇదే. మ‌నం డ‌బ్బు, బాక్సాఫీస్ ప‌రంగా మాత్ర‌మే మెయిన్ స్ట్రీమ్ సినిమాల గురించి ఆలోచించడం ప్రారంభించాం. మనం స్వీయ విమ‌ర్శ చేసుకోం. అందుకే వారిని 'అలగ్' (విభిన్నం) అని పిలవడం ద్వారా వారిని వేరు చేస్తుంటా. కానీ ఇది ఒక పాఠం. మెయిన్ స్ట్రీమ్ సినిమాని ఎలా తియ్యాలనే విష‌యంలో ముంబై ఇండ‌స్ట్రీ మెయిన్‌స్ట్రీమ్ డైరెక్ట‌ర్ల‌కు ఇదొక పాఠం." అని చెప్పుకొచ్చాడు మ‌నోజ్ బాజ్‌పేయి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.