![]() |
![]() |

మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ గా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒరిజినల్ లో లేని ఎన్నో కొత్త సన్నివేశాలు రీమేక్ లో ఉన్నాయి. నాయక్ కి ఫ్లాష్ బ్యాక్ పెట్టడం, దానిని క్లైమాక్స్ కి లింక్ చేయడం ఆకట్టుకుంది. అలాగే ఒరిజినల్ కంటే భీమ్లా నాయక్ లో పలు పాత్రలను బలంగా తీర్చిదిద్దారు. అందులో నిత్యా మీనన్ పోషించిన సుగుణ పాత్ర ఒకటి.
ఈ మూవీలో భీమ్లా నాయక్ భార్య సుగుణ పాత్రలో నిత్యా మీనన్ నటించింది. ఒరిజినల్ కంటే ఈ పాత్రను చాలా బలంగా తీర్చిదిద్దారు రచయిత, దర్శకుడు. ఆమె పాత్రకి, సాయం చేసే మనసుతో పాటు గయ్యాళితనం ఉంటుంది. ఓ వైపు అడవి బిడ్డల దగ్గర తేనె వంటి వాటిని ఎక్కువ మొత్తంలో డబ్బిచ్చి కొనుక్కొని వారికి సాయం చేస్తూ ఉంటుంది. మరోవైపు ఎవరైనా నోరుజారితే చెంప పగలకొట్టి గడుసుతనం చూపిస్తుంది. ఆ ఊరిలో మద్యం దుకాణం నడిపే రావు రమేష్ ఆమెని చూస్తేనే వణికిపోతాడంటే అర్థం చేసుకోవచ్చు ఆమె నోటి పవరేంటో. ఒకసారైతే ఊరిలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పెళ్ళాం పిల్లల్ని వదిలేసి రెండు రోజులుగా బార్ లోనే ఉండటంతో.. మహిళలని వెంటబెట్టుకొని వెళ్లి రచ్చ చేస్తుంది.
భీమ్లా నాయక్ సినిమా ప్రారంభంలో డేనియల్ పాత్రధారి రానా రెచ్చగొడుతున్నా పవన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంటాడు. కానీ నిత్య మాత్రం వాడిని కొట్టు, వదలొద్దు అంటూ నాయక్ ని రెచ్చగొడుతుంది. ఒకానొక సమయంలో నీ గయ్యాళితనం తట్టుకోవడం నావల్ల కాదని పవన్ సైతం చేతులెత్తేస్తాడు. ఇలా ఆమె పాత్రని ఆకట్టుకునేలా చక్కగా మలిచారు. ఓ రకంగా ఈ సినిమాలో నిత్యా మీనన్ ఫైర్ బ్రాండ్ లా కనిపించింది.
![]() |
![]() |