![]() |
![]() |

భారీ అంచనాల నడుమ ఈ రోజు `భీమ్లా నాయక్` విడుదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ డ్రామాలో డేనియల్ శేఖర్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో అదరగొట్టాడు రానా దగ్గుబాటి. పవన్ తో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి మరీ నటించి మెప్పించాడు. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ మూటగట్టుకున్న ఈ సినిమాతో రానా ఖాతాలో మరో మెమరబుల్ హిట్ చేరినట్లేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `భీమ్లా నాయక్` విడుదలైన ఫిబ్రవరి 25నే గతంలో దగ్గుబాటికి చెందిన రెండు తరాల వారు మరపురాని విజయాలు చూశారు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత, రానా తాత డి. రామానాయుడు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన `ముందడుగు` చిత్రం 1983లో ఇదే ఫిబ్రవరి 25న జనం ముందు నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు కాంబోలో వచ్చిన ఈ మల్టిస్టారర్ ఘనవిజయం సాధించింది.
కట్ చేస్తే.. 1998లో ఇదే ఫిబ్రవరి 25న సీనియర్ స్టార్, రానా బాబాయ్ విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన `సూర్యవంశం` విడుదలై అఖండ విజయం అందుకుంది. ఇలా.. 1983లో రామానాయుడుకి, 1998లో వెంకీకి, 2022లో రానాకి మెమరబుల్ హిట్స్ అందించి దగ్గుబాటి వారి మూడు తరాలకు అచ్చొచ్చిన అరుదైన తేదిగా రికార్డులకెక్కింది ఫిబ్రవరి 25. మరి.. రాబోయే కాలంలోనూ దగ్గుబాటి వారికి ఈ తేది మరిన్ని గుర్తుండిపోయే విజయాలను అందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |