![]() |
![]() |

పాల్ డబ్ల్యు.ఎస్. ఆండర్సన్ డైరెక్ట్ చేస్తోన్న లైవ్ యాక్షన్ మూవీ 'మాన్‌స్టర్ హంటర్' ఫస్ట్ టీజర్‌ను సోనీ పిక్చర్స్ ప్రపంచం ముందుకు తెచ్చింది. మిల్లా జొవోవిచ్, టోనీ జా నటించిన ఈ సినిమాని క్యాప్‌కామ్ వీడియో గేమ్ ఫ్రాంచైజీ నుంచి అదే పేరుతో తెరకెక్కించారు. మనుగడం కోసం లెఫ్టినెంట్ ఆర్టెమిస్, ఆమె సిబ్బంది భారీ మాన్‌స్టర్లతో ఎలా యుద్ధం చేశారనేది ఈ సినిమాలోని ప్రధానాంశం. ఆర్టెమిస్ క్యారెక్టర్‌లో 'రెసిడెంట్ ఈవిల్', 'జూలాండర్' సినిమాల హీరోయిన్ మిల్లా జోవోవిచ్ నటించింది.
'మాన్‌స్టర్ హంటర్' టీజర్‌ను శనివారం కామిక్-కాన్ రష్యా 2020లో ఆవిష్కరించారు. కేవలం 16 సెకన్ల నిడివి వున్న ఈ సంక్షిఫ్త టీజర్‌లో ఆర్టెమిస్, ఆమె టీమ్ మెంబర్స్ అయిన టి.ఐ., డీగో బొనెటా, మీగన్ గుడ్ కనిపించారు. ఒక ఎడారిలో ఆర్టెమిస్, ఆమె టీమ్ తమ వాహనాల్లో ఆయుధాలు పట్టుకొని నిల్చొని మాన్‌స్టర్ ఏ వైపు నుంచి తమపై దాడి చేస్తుందా అని చెవులు రిక్కించి నిశ్శబ్దంగా వెయిట్ చేస్తుంటారు. అంతలో డ్రాగన్ ముఖం, క్రాబ్ దేహం ఉన్న 'బ్లాక్ డయాబ్లోస్' మాన్‌స్టర్ ఇసుకలోంచి ఒక్క ఉదుటున లేచి ప్రత్యక్షమవుతుంది. ఆ వెంటనే ఆర్టెమిస్ బృందం తమ మెషిన్ గన్లతో దాన్ని కాల్చడానికి ప్రయత్నిస్తారు.

లెఫ్టినెంట్ ఆర్టెమిస్, ఆమె బృందం ఎవరో తెలియజేయడమే కాకుండా, డిసెంబర్ 2020లో మూవీ విడుదలవుతుందని కూడా ఈ టీజర్ వెల్లడించింది. ఇదివరకు ఫిబ్రవరిలో ప్రధాన పాత్రధారులు మిల్లా జోవోవిచ్, టోనీ జా ఉన్న మాన్‌స్టర్ హంటర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను నిర్మాతలు రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 2020లో విడుదల కావాల్సిన ఈ మూవీని కరోనా మహమ్మారి కారణంగా 2021 ఏప్రిల్‌కి వాయిదా వేసినట్లు జూన్‌లో తెలిపారు. తాజాగా టీజర్‌లో ప్రకటించిన డిసెంబర్ రిలీజ్‌కు నిర్మాతలు కట్టుబడి ఉంటారని ఆశిద్దాం. భయంకరమైన బ్లాక్ డయాబ్లోస్ మాన్‌స్టర్‌తో జోవోవిచ్ చేసే భీకర పోరాటాన్ని చూసేందుకు యాక్షన్ ప్రియులంతా అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

![]() |
![]() |