![]() |
![]() |

'సర్కారు వారి పాట' కోసం సూపర్‌స్టార్ మహేశ్ శారీరకంగా బాగా శ్రమిస్తున్నాడు. ఫిట్‌నెస్ కోసం మహేశ్ ఎలా శ్రమిస్తున్నాడో తెలియజేసే ఓ ఫొటోను ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న 'సర్కారు వారి పాట' షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. అక్కడ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచీ తన ఫ్యామిలీతో అక్కడే ఉంటున్నాడు మహేశ్. ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్.
ఫొటోతో పాటు షేర్ చేసిన సుదీర్ఘమైన నోట్‌లో 2019 నుంచి మహేశ్‌కు తానెలా ట్రైనింగ్ ఇస్తున్నదీ వెల్లడించిన మినాష్, మహేశ్ హార్డ్‌వర్క్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. మినాష్ షేర్ చేసిన ఫొటోలో ఓవైపు ఎక్సర్‌సైజ్ చేస్తూ, మరోవైపు తన ట్రైనర్ చెబుతున్నది వింటున్నాడు మహేశ్. "దుబాయ్‌లో మహేశ్ నటిస్తోన్న 'సర్కారువారి పాట' కోసం గత నెలరోజులుగా నేను అక్కడే ఉన్నాను. దుబాయ్‌లో అడుగుపెట్టిన రోజు నుంచీ మహేశ్ షూటింగ్ చేసుకొని వచ్చాక ప్రతిరోజూ జిమ్‌లోనే గడుపుతూ వచ్చాను." అని తెలిపాడు మినాష్.
ఐసోలేషన్ డేస్ మినహాయించి 30 రోజుల పాటు నాన్-స్టాప్‌గా మహేశ్ ట్రైనింగ్ తీసుకున్నాడని అతను వెల్లడించాడు. "మహేశ్ ప్రతిరోజూ షూటింగ్ చేసుకొని సాయంత్రం వేళ జిమ్‌లో ఏమాత్రం అలసట లేకుండా, అదే ఇంటెన్సిటీతో ట్రైనింగ్ తీసుకొనేవాడు. ఎడారిలో వేసిన సెట్‌లో ఛాలెంజింగ్ కండిషన్స్‌లో పనిచేసినా, ఫిట్‌నెస్ ట్రైనింగ్‌ని మాత్రం ఆపలేదు. వంద శాతం ఆ రోజు ట్రైనింగ్ తీసుకుంటూ వచ్చాడు." అని చెప్పాడు.
"ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, 2019లో మేం తొలిసారి మీట్ అయినప్పటితో పోలిస్తే, మహేశ్ బాబు ఫిట్‌నెస్ చాలా చాలా మెరుగయ్యింది. గాయాలతో పోరాడి, వాటిని దాటుకొని, అద్భుతమైన షేప్‌లోకి వచ్చాడు. ఈ మనిషి వయసులో వెనక్కి వెళ్తున్నాడనీ, టైమ్‌తో పాటు మరింత మెరుగవుతున్నాడనీ నిక్షేపంగా చెప్పగలను." అని రాసుకొచ్చాడు మినాష్.
'సర్కారు వారి పాట' మూవీ 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది.
![]() |
![]() |