![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌ని 'శ్రీమంతుడు'కి ముందు, తరువాత అన్నట్లుగా విభజించవచ్చేమో. ఎందుకంటే.. ‘శ్రీమంతుడు’కి ముందు ఎక్కువగా యాక్షన్ చిత్రాల వైపు మొగ్గు చూపించిన మహేశ్.. సదరు కొరటాల శివ డైరెక్టోరియల్ నుండి పూర్తిగా బాణీ మార్చాడు. సామాజిక స్పృహ ఉండేలా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు మహేశ్. ‘శ్రీమంతుడు’ తర్వాత వచ్చిన ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా మహేశ్ ప్రతి చిత్రం ఏదో ఒక సామాజిక అంశాన్ని స్పృశిస్తూ తెరకెక్కిందే. వీటిలో ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ నిరాశపరచగా.. మిగిలిన చిత్రాలు విజయపథంలో పయనించాయి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మహేశ్ నుండి రాబోతున్న తదుపరి చిత్రం 'సర్కారు వారి పాట' కూడా అదే బాటలో వెళ్లనుంది. ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశురామ్ రూపొందిస్తున్న ఈ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఫిలిమ్‌లో కొత్త తరహా పాత్రలో దర్శనమివ్వనున్నాడు మహేశ్. స్ట్రాంగ్ మెసేజ్‌తో తెరకెక్కుతున్న ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్ ఇదని.. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఇప్పటికే చెప్పుకొచ్చాడు మహేశ్.
కాగా, ఇందులో మహేశ్ ఓ బ్యాంకు మేనేజర్ కొడుకుగా కనిపిస్తాడని.. వేలాది కోట్లు ఎగవేసిన ఓ బిజినెస్‌మాన్ నుండి ఆ మొత్తాన్ని రాబట్టే క్రమంలో మహేశ్ వేసే ప్లానింగ్స్ అన్నీ ఆద్యంతం ఆసక్తిదాయకంగా ఉంటాయని సమాచారం. అంతేకాదు.. ఇందులో చెప్పే సందేశం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందని టాక్.
మరి.. మెసేజ్ ఓరియంటెడ్ డ్రామాలతో ఇప్పటికే మూడు వరుస విజయాలు అందుకున్న మహేశ్.. రాబోయే చిత్రంతోనూ ఆ పరంపరను కొనసాగిస్తాడేమో చూడాలి. ‘సర్కారు వారి పాట’ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ సంగీత సంచలనం తమన్ బాణీలను అందిస్తున్నాడు.
![]() |
![]() |