![]() |
![]() |

'నచ్చావులే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మాధవీలత గుర్తుందా? ప‌్రస్తుతం బీజేపీ నాయకురాలిగా మారిన ఆమె గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా వార్తల్లో నిలుస్తోంది. వివాదాస్పద అంశాలపై స్పందిస్తూ అనునిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా తనని సోషల్ మీడియాలో కొంత మంది టార్గెట్ చేశారని, వేధిస్తున్నారని గురువారం పోలీసుల్ని సంప్రదించడం ఆసక్తికరంగా మారింది.
తనని కొంత మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, అసభ్యకర పోస్టులతో వేధిస్తున్నారని గురువారం నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత నగర సీపీ సజ్జనార్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. మాధవీలత మాట్లాడుతూ "ఓ వర్గం నన్ను టార్గెట్ చేస్తోంది. వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్ట్‌లు పెడుతోంది. ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితే అందులో నేనున్నానంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలపై ఇంత కాలం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేశా" అని తెలిపింది.
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం తనని మానసికంగా కుంగదీస్తోందని, అందుకే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించానని వెల్లడించింది. ఇలాంటి అభ్యంతరకర చర్యలకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరినట్టు మాధవీలత స్పష్టం చేసింది.
![]() |
![]() |