![]() |
![]() |

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచి, కేవలం సంగీత ప్రపంచాన్నే కాకుండా, అశేష అభిమానుల్ని శోక సంద్రంలో ముంచేశారు. కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వచ్చిన బాలు ఆ రోజు మధ్యాహ్నం 1:04 గంటలకు గుండె, శ్వాస ప్రక్రియ ఆగిపోవడంతో మృతి చెందినట్లు ఆయన తనయుడు చరణ్ ప్రకటించారు. దీంతో భారతీయ చిత్రపరిశ్రమ అంతా షాక్‌కు గురైంది. ఆయన మృతికి సంతాపాలు వెల్లువెత్తాయి.
బాలు పార్థివ దేహాన్ని తమిళనాడు తిరువల్లూర్ జిల్లాలోని తామరైపాకంలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో ఖననం చేశారు. అంతిమ సంస్కారాలు తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక లాంఛనాలతో జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా మరీ ఎక్కువ కాకపోయినా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే అభిమానులు, సెలబ్రిటీలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా అంతిమ సంస్కారాలకు సంబంధించిన సంబంధించిన కొన్ని ఫొటోలను ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “Getting to terms with reality” అని ఎమోషనల్‌గా క్యాప్షన్ పెట్టారు. నిజానికి, ఆయన మృతి ఎవరూ ఊహించనిది. ఎలాగైనా కరోనా మహమ్మారిని ఆయన జయించి, ఎప్పటిలా తమ ముందుకు వచ్చి పాటలు పాడతారని అంతా అనుకున్నారు. అందుకే ఆయన మరణం అందరిలోనూ అత్యంత విషాదాన్ని నింపింది.
బాలు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాదు, సంగీత దర్శకుడు కూడా. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన 50 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. అలాగే నటుడిగానూ రాణించారు. కొన్ని సినిమాలు నిర్మించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా స్టార్ హీరోలకు పనిచేశారు.

![]() |
![]() |