![]() |
![]() |

ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ పెళ్లయి పదమూడేళ్లు. 2007 ఏప్రిల్ 20న వారు దంపతులయ్యారు. వాళ్ల వైవాహిక జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు వర్థిల్లుతోంది. సోషల్ మీడియా ప్రభావం లేని కాలంలోనే దశాబ్దపు పెళ్లిగా వారి పెళ్లిని మీడియా అభివర్ణించింది. ఆ పెళ్లిలో ఐశ్వర్య గోల్డ్ కలర్ కాంచీపురం చీరలో మెరవగా, అభిషేక్ సిల్వర్ కలర్ షేర్వాణీలో ఆకట్టుకున్నాడు. 2011లో వారు ఆరాధ్యకు తల్లిదండ్రులయ్యారు.
ఒకసారి ఐశ్వర్య, అభిషేక్ వివాహాన్ని తలచుకుంటే.. దేశంలోని అతి భారీ వివాహ మహోత్సవాల్లో ఒకటిగా అది పేరు తెచ్చుకుంది. అలాగే, ఐశ్వర్య అత్యంత ఖరీదైన పెళ్లి బట్టలు ధరించింది. అసలే మెరుపుతీగ. దానికి తగ్గట్లు గోల్డెన్ కాంచీపురం చీర, సంప్రదాయ ఆభరణాలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. ఆమె పెళ్లి దుస్తుల్ని డిజైన్ చేసిందెవరో తెలుసా? ప‌్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. ఆమె మన గుణశేఖర్ డైరెక్ట్ చేసిన 'రుద్రమదేవి' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. అందమైన గోల్డ్ బోర్డర్, అత్యంత ఖరీదైన క్రిస్టల్స్‌తో ఐశ్వర్య శారీని ఆమె డిజైన్ చేసింది.
ఇక్కడే ఓ విశేషం ఉంది. ఆ చీరను నిజమైన బంగారు దారంతో తయారు చేశారు. దానిపై మణులు తాపడం చేశారు. 2007లోనే ఆ చీర ఖరీదెంతో తెలుసా? అక్షరాలా 75 లక్షల రూపాయలు! ఇప్పటి దాకా దేశంలో అంత ఖరీదైన పెళ్లి చీర ధరించినవారు లేరు. అభిషేక్ ధరించిన ధవళ వర్ణ షేర్వాణీపై కూడా గోల్డ్ వర్క్ ఉంది. అదీ విషయం, అదీ విశేషం!

![]() |
![]() |