![]() |
![]() |
రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమా ఆ తర్వాత తెలుగులో విడుదలైంది. అలాగే తమిళ్, హిందీలలో కూడా రిలీజ్ అయి చాలా పెద్ద హిట్ అయింది. సాధారణంగా ఒక సినిమా పెద్ద హిట్ అయితే దానికి సీక్వెల్స్ చేస్తుంటారు. కానీ, ‘కాంతార’ చిత్రానికి సీక్వెల్ కాకుండా ప్రీకెల్ చేస్తున్నారు. కాంతార సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రీక్వెల్‌కి భారీ బడ్జెట్ పెడుతున్నారు. దానికి తగ్గట్టుగానే హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘కాంతార1’ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. దీంతో థియేట్రికల్ రైట్స్‌కి డిమాండ్ పెరిగింది. మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ ‘కాంతార1’ రైట్స్ దక్కించుకున్నారు. అతని డిస్ట్రిబ్యూషన్‌లోనే కేరళలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పుడీ సినిమాను కేరళలో బ్యాన్ చేశారు ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిటర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి మధ్య షేర్ పర్సంట్ విషయంలో ఏర్పడిన వివాదం కారణంగా సినిమాను బ్యాన్ చేశారు. రెగ్యులర్‌గా డబ్బింగ్ సినిమాలకు ఇచ్చే పర్సెంట్ కంటే ఎక్కువ అడుగుతున్నారని, తాము దానికి ఒప్పుకునేది లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అందుకే మూకుమ్మడిగా కేరళలో ‘కాంతార1’ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నామని ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుండగా ఈ వివాదం ఏర్పడడం, రిలీజ్‌ని బ్యాన్ చెయ్యడం పృథ్విరాజ్‌కి ఆందోళన కలిగిస్తోంది. ‘కాంతార1’ సినిమా రిలీజ్ టైమ్‌కి వివాదం ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
![]() |
![]() |