![]() |
![]() |

సొంత సోదరుడ్ని హత్య చేసి, అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి, వాటిని వివిధ ప్రదేశాల్లో పడేసిన కేసులో కన్నడ నటి షనయ కాత్వేని పోలీసులు అరెస్ట్ చేశారు. తన లేటెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్‌లో ఉన్న ఆమెను హుబ్బళ్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గురైన రాకేశ్ కాత్వే (32) తల దేవరగుడిహాల్ అటవీ ప్రాంతంలో లభ్యం కాగా, అతడి మిగతా శరీర భాగాలు హుబ్బళ్లిలోని గడగ్ రోడ్, ఇతర ప్రదేశాల్లో లభ్యమయ్యాయి. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ధార్వాడ్ జిల్లా పోలీసులు కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా నియాజ్ అహ్మద్ కటిగర్ (21), తౌసిఫ్ చన్నపూర్ (21), అల్తాఫ్ ముల్లా (24), అమన్ గిరనివాలే (19)లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మరో ముగ్గురు అనుమానితుల్ని వారు అదుపులోకి తీసుకున్నారు.
విచారణ సందర్భంగా.. ఈ హత్యకూ, హతుడి సొంత సోదరి షనయ లవ్ ఎఫైర్‌కూ సంబంధం ఉందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. మాజీ మిస్ కర్ణాటక అయిన షనయ మోడల్‌గా రాణిస్తూ సినీ నటిగా కొనసాగుతోంది. నియాజ్ అహ్మద్‌తో ఆమె ప్రేమలో పడగా, రాకేశ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతో అతడి అడ్డు తొలగించుకోవాలని హత్యకు పథకం వేశాడు నియాజ్.
ఏప్రిల్ 9న తన లేటెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్ నిమిత్తం హుబ్బళ్లికి వచ్చింది షనయ. అదే రోజు, వాళ్ల ఇంట్లో హత్య జరిగింది. రాకేశ్‌ను గొంతుకోసి హత్య చేశారు. ఒక రోజు తర్వాత, ఆ శరీరాన్ని ముక్కలుగా కోసిన నియాజ్, అతని స్నేహితులు, హుబ్బళ్లిలోని వేర్వేరు ప్రదేశాల్లో వాటిని పడేశారు. ఈ హత్యతో సంబంధం ఉందనే అభియోగంతో గురువారం షనయను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

![]() |
![]() |