![]() |
![]() |

డైరెక్టర్ అవ్వాలనీ, తమ కథతో స్టార్ హీరోతో సినిమా తియ్యాలనీ ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వచ్చే యువకులు వందలు కాదు, వేలాది మంది ఉంటారు. వారిలో వేళ్లమీద లెక్కించదగ్గ అతికొద్దిమంది మాత్రమే డైరెక్షన్ చాన్స్ పొందుతుంటారు. ఇక స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ పొందే కొత్తవాళ్లు మరీ తక్కువమంది ఉంటారు. సాధారణంగా స్టార్స్ కొత్తవాళ్ల కథలను నేరుగా వినరు. వాళ్ల మేనేజర్లు లేదా వారి పర్సనల్ పీఆర్వోలు మొదట కథవిని, వాళ్లకు నచ్చితేనే స్టార్ హీరోకు రికమెండ్ చేస్తారు. అప్పుడు మరోసారి ఆ కథను ఆ హీరోకు నచ్చేలా చెప్పాలి. ఆయనకు ఆ కథ నచ్చవచ్చు, లేకపోనూ వచ్చు. నచ్చినా కూడా ఆ కొత్త డైరెక్టర్ సినిమాని ఎలా తీస్తాడోననే డౌట్ స్టార్ హీరోకు ఉంటుంది. అందుకే చాలా సందర్భాల్లో చిన్న, మధ్యస్థాయి హీరోలతో సినిమా చేసి, బాగా తీశాడని పేరొచ్చిన డైరెక్టర్‌కే స్టార్ హీరోలు చాన్స్ ఇస్తుంటారు.
కొంతమంది స్టార్ హీరోలకు పర్సనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నవారిలో నటుడు రాజా రవీంద్ర ఒకరు. ఒకప్పుడు ఆయన చిరంజీవి, రవితేజ లాంటి స్టార్లకు డేట్స్ కూడా చూశారు. ఆ తర్వాత జయసుధ, మంచు విష్ణు, సునీల్, నిఖిల్, రాజ్ తరుణ్ లాంటి వాళ్లకు చూస్తూ వచ్చారు. డైరెక్టర్ కావాలనుకొని వచ్చే కొత్త కుర్రాళ్ల కథలు వినీ వినీ తనకు కథల మీదే జడ్జిమెంట్ పోయిందని ఒకసారి తెలుగువన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసలు కొత్త డైరెక్టర్ అంటేనే తనకు దడ వచ్చేసేదని ఆయన అన్నారు.
"ఇప్పుడు పది మంది పది కథలతో కొత్తవాళ్లు వస్తున్నారు. వాళ్లు షార్ట్ ఫిలిమ్స్ తీసి వచ్చేవాళ్లు. ఒక షార్ట్ ఫిలిమ్ అంటే పది నిమిషాలు ఉంటుంది. అదెలా తీసినా బాగానే ఉంటుంది. కంటెంట్ 10 నిమిషాల్లో చెప్పాలంటే ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. అదే కథను 2 గంటలు తీసి, ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యాలంటే.. ఇట్స్ నాట్ ఎ జోక్. సాఫ్ట్‌వేర్ వాళ్లు సెల్‌ఫోన్‌తో షార్ట్‌ఫిల్మ్ తీసి వస్తుంటారు. వాటికి తలా-తోకా ఉండదు. అలాంటివాళ్లను హీరో దగ్గరకు పంపామనుకోంటే వాళ్ల టైమ్ వేస్టవుతుంది కదా! అందుకని ఎవరైనా కథ చెప్పాలనుకున్నప్పుడు నన్నడుగుతారు. మూడు నెలల పాటు పొద్దున ఒక కథ, సాయంత్రం ఒక కథ వింటూ వచ్చాను. దాంతో నాకు జడ్జిమెంట్ పోయింది." అని చెప్పారు రాజా రవీంద్ర.
అలా అని ఆయన వాళ్లమీద ఆయనకు చిన్నచూపు లేదు. "వాళ్లు ఎంతో కష్టపడి అదే లైఫ్ అన్నట్లు ఫీలవుతూ వస్తారు. దానిమీద విపరీతమైన ఎఫర్ట్ పెడతారు. కథ విననని చెప్పి వాళ్లను నేను డిజప్పాయింట్ చెయ్యలేను. అదే సమయంలో కొన్ని మంచి కథలూ వినలేను. నా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ నాకుంటుంది, అతని ఆవేదన అతనికుంటుంది. నా జడ్జిమెంట్ వేరే ఉంటుంది, హీరో జడ్జిమెంట్ వేరే ఉంటుంది. ఒకవేళ కొత్త డైరెక్టర్‌కు ప్రాజెక్టు ఓకే అయితే, షూటింగ్ ఫస్ట్ డే నుంచే ప్రాబ్లమ్స్ మొదలవుతాయ్. సినిమాకి 24 క్రాఫ్ట్స్ ఉంటాయనే విషయం తెలియనివాళ్లు కూడా ఉంటారు. వాళ్లకు ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ తెలీవు. అందర్నీ కో-ఆర్డినేట్ చేసుకోలేడు, తనకేం కావాలో చెప్పలేడు. షూటింగ్‌లో ఇది లేదు, అదిలేదని అరుస్తుంటాడు. దాంతో ప్రొడ్యూసర్‌కు, హీరోకు టెన్షన్. మధ్యలో ఆ డైరెక్టర్‌ని తీసేస్తే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇదివరకు కొత్తవాళ్లంటే టాలెంట్ ఉంటుందనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు వాళ్లను చూస్తుంటే దడ వచ్చేస్తోంది" అని చెప్పుకొచ్చారు రాజా రవీంద్ర.
![]() |
![]() |