![]() |
![]() |

కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ల జాతర నడుస్తోన్న విషయం తెలిసిందే. 2020లో కరోనా మహమ్మారి దెబ్బకు సినిమాలన్నీ ఆగిపోవడం, తిరిగి ఇప్పుడు అన్ని సినిమాల షూటింగ్‌లు కొనసాగుతుండటంతో ఎందుకైనా మంచిదని ముందుగానే రిలీజ్ డేట్లను బుక్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఒకే తేదీన మూడు నాలుగు సినిమాలు కూడా పోటీపడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే రెండు క్రేజీ ప్రాజెక్టులు ఒకే రోజున పోటీ పడుతున్న సందర్భం మాత్రం మే నెలలో చోటు చేసుకుంటోంది. ఆ సినిమాలు.. బాలకృష్ణ 'బీబీ3' (వర్కింగ్ టైటిల్), రవితేజ 'ఖిలాడి'. ఆ రెండింటినీ మే 28న విడుదల చేస్తున్నట్లు వాటి మేకర్స్ అనౌన్స్ చేశారు.
అయితే రెండు సినిమాల్లో ముందుగా ప్రకటించింది 'ఖిలాడి' రిలీజ్ డేటే. జనవరి 30న 'ఖిలాడి' రిలీజ్ డేట్ బయటకు రాగా, ఒక రోజు తర్వాత 'బీబీ3' రిలీజ్ డేట్ ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర "బాలకృష్ణ వర్సెస్ రవితేజ" అనే పరిస్థితి తలెత్తింది. 'క్రాక్' మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో రవితేజ నెక్ట్స్ సినిమా అయిన 'ఖిలాడి'పై అంచనాలు బాగా పెరిగాయి. ఆయన మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. దాంతో పాటు ఆ సినిమా ఫస్ట్ లుక్‌కు సైతం మంచి స్పందన లభించింది. 'ఖిలాడి'లో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. 'రాక్షసుడు' లాంటి హిట్ తర్వాత రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తుండటం కూడా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్‌ను అందిస్తోంది. హీరో, డైరెక్టర్ ఇద్దరి మునుపటి సినిమాలు విజయాలు సాధించడం ఈ సినిమాకు కలిసొస్తున్న అంశం.
మరోవైపు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో ఫిల్మ్‌కు కూడా అంచనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ, ఆ ఇద్దరి కలయికలో వచ్చిన మునుపటి రెండు సినిమాలు.. 'సింహా', 'లెజెండ్'.. బాక్సాఫీస్ దగ్గర వీరంగం ఆడటంతో 'బీబీ3' మూవీతో వారికి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ ఖాయమనే నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది. బాలకృష్ణ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ, బోయపాటి మునుపటి సినిమా 'వినయ విధేయ రామ' ఫ్లాపైనప్పటికీ 'బీబీ3'పై బయ్యర్ల నమ్మకాలు సడలలేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైన బాలయ్య లుక్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో బాలయ్య కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ రోల్ అనీ, మరొకటి అఘోరా క్యారెక్టర్ అనీ ప్రచారం జరుగుతోంది.
మే 28 ప్రాముఖ్యం ఏమిటనే విషయం మనకు తెలిసిందే. అది.. విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జయంతి తేదీ. కాబట్టి ఆ తేదీ తమకు సొంతమనే అభిప్రాయంతో బాలయ్య ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీ నుంచి వైదొలగి, మరో తేదీకి తన సినిమా రిలీజ్‌ను వాయిదా వేసే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం లేదు. పైగా రవితేజ సినిమా బరిలో ఉంటే తప్పుకునే ఉద్దేశం అసలుండదు. అందుకే మే 28కి 'బీబీ3' రావడం ఖాయం. మరి 'ఖిలాడి' రిలీజ్ డేట్‌ను ముందుకు గానీ, వెనక్కి గానీ జరిపే ఉద్దేశం ఆ సినిమా మేకర్స్‌కు ఉందా? ఇప్పటి దాకా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఆ సినిమాని 'రాక్షసుడు' మూవీ ప్రొడ్యూసర్ కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా మే 28న సినిమాని రిలీజ్ చేయాలనే పట్టుదలతోటే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ ఇప్పటి రోజుల్లో సినిమా విడుదల తేదీలు డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లో ఉన్నాయి. అందువల్ల వారు బాలయ్య సినిమాకు పోటీగా అదే రోజు 'ఖిలాడి'ని విడుదల చేయించాలని అనుకోరు. ఒకవేళ రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్‌కు భారీగా గండిపడటం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో చూడాలి. అయితే గియితే.. రెండింట్లో రిలీజ్ డేట్ మారే అవకాశాలు 'ఖిలాడి'కే ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం.
![]() |
![]() |