![]() |
![]() |

ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ఆదిపురుష్' మూవీ సెట్ తొలిరోజు షూటింగ్‌లోనే అపశ్రుతి చోటు చేసుకుంది. సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సెట్‌లో కొంతమేర తగలబడిపోయింది. అయితే ఆస్తి నష్టం జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరట. 'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఈ రోజు ఉదయమే మొదలైంది. ముందుగా 16ఏ సీన్‌లోని సెకండ్ షాట్‌ను ముహూర్తపు సన్నివేశంగా చిత్రీకరించారు. షూటింగ్ మొదలైన విషయాన్ని "ఆదిపురుష్ ఆరంభ్" అంటూ ఓ పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయడం ద్వారా ప్రభాస్ వెల్లడించాడు.
సాయంత్రం 4:15 గంటలకు ముంబైలోని బంగూర్ నగర్‌లో వేసిన సెట్‌కు మంటలంటుకున్నాయని ముంబై అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఓపెన్ ప్లాట్‌లో నెలకొల్పిన స్టూడియోలో ఈ సెట్ వేశారు. ఉదయం ముహూర్తపు షాట్ తీశాక, మధ్యాహ్నం తర్వాతే షూటింగ్ ప్రారంభించారనీ, ఆ కొద్దిసేపటికే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నదనీ సమాచారం. ఇది లెవల్-2 అగ్నిప్రమాదమని అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎనిమిది ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.
మంటలు వ్యాపించిన సమయంలో కథానాయకుడిగా నటిస్తోన్న ప్రభాస్ కానీ, ప్రతినాయకుడిగా నటిస్తోన్న సైఫ్ అలీఖాన్ కానీ లేరు. యూనిట్ సభ్యుల్లో ఎవరూ గాయపడిన సమాచారం లేదు. రూ. 400 కోట్ల భారీ బట్జెట్‌తో 'ఆదిపురుష్' రూపొందుతోంది.

![]() |
![]() |