![]() |
![]() |

భారతదేశంలోనే తొలి ప్రయత్నంగా విజయవాడలో ఓపెన్ ఎయిర్ రెస్టో థియేటర్ విజయవాడలో నేడు ప్రారంభమవుతోంది. దాని పేరు '9 కిచెన్స్'. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనీ ఈ థియేటర్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ప్రతి రోజూ రాత్రి ఫస్ట్ షో, సెకండ్ షోలను ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ప్రదర్శిస్తారు. తొలి సినిమాగా లాక్‌డౌన్ అనంతరం ఇండియాలోనే తొలి బ్లాక్‌బస్టర్ అయిన 'క్రాక్'ను ప్రదర్శించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీని కెపాసిటీ 425 సీట్లు. 100 కార్లను పార్క్ చేసుకొనే వీలుంది. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఎన్ఏసీ కల్యాణవేదిక పక్కన దీనిని ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఈ తరహాలో మలేషియాలో ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆ ప్రయత్నం హిట్టయ్యింది. అక్కడ విశాలమైన మైదానంలో కొన్ని గుడారాలను నిర్మించి, ఓ వైపు స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా తమ కుటుంబంతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ ఆ గుడారాలను బుక్ చేసుకోవచ్చు. ప్రతి గుడారం దగ్గర నిర్వాహకులు ఆహార పదార్ధాలను, క్యాండిల్స్‌ను సప్లై చేస్తారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తుండగా, బహిరంగ ప్రదేశంలో గుడారం ముందు కూర్చొని స్నాక్స్‌ను ఆరగిస్తూ, ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యే సినిమాని తిలకించడమనే అనుభవాన్ని సొంతం చేసుకునేందుకు జనం ఆసక్తి చూపుతూ వచ్చారు.
ఇప్పుడు అదే తరహాలో విజయవాడలో '9 కిచెన్స్' రెస్టో థియేటర్‌ను ఏర్పాటుచేయడం గమనార్హం. అంటే ఇది ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ కమ్ థియేటర్ అన్నమాట. తెలుగు రాష్ట్రంలో ఈ కాన్సెప్ట్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.
![]() |
![]() |