![]() |
![]() |

చెన్నైలో ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యం, మేస్ట్రో ఇళయరాజా మధ్య కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న వివాదం ముగిసింది. ప్రసాద్ స్టూడియోలోని తన చాంబర్‌కు వచ్చి, తన వస్తువులను తీసుకొని, దాన్ని ఖాళీ చేయడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా సోమవారం ఉదయం ప్రసాద్ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా సహాయకులు, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. పరికరాలు తీసుకెళ్లేందుకు ఇళయరాజా రాకుండా సహాయకులను పంపారు.
అయితే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్ థియేటర్ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను ఒక వేర్‌హౌస్‌లోకి తరలించి ఉండడంతో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఇళయరాజా తీవ్ర మనస్తాపానికి గురై స్టూడియోకి రాలేదని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. తనకు సమాచారం అందించకుండా అందులోని సామగ్రినంతా తరలించి, దాన్ని ఖాళీ చేశారనే సమాచారంతో ఇళయరాజా గుండె పగిలిందని ఆయన చెప్పారు. ఆ వస్తువుల్లో రాజాకు సంబంధించిన పలు ఫొటోలతో పాటు పద్మభూషణ్ అవార్డ్ కూడా ఉండటం గమనార్హం. వీడియోలో చిత్రీకరిస్తుండగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులే ఆయన సామగ్రిని పట్టుకెళ్లారు.
ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియోస్‌లో 1976లో ప్రత్యేక రికార్డింగ్ చాంబర్‌ను ఏర్పాటు చేసి ఇచ్చింది యాజమాన్యం. అయితే కాలక్రమంలో ఆయనతో మనస్పర్ధలు రావడంతో స్టూడియోను ఖాళీ చేయమంటూ స్టూడియో యాజమాన్యం కొంత కాలం క్రితం ఇళయరాజాను కోరింది. దీనికి ఇళయరాజా నిరాకరించారు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది.
అయితే స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు, మెడిటేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు ఇళయరాజా. దీనికి మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తరువాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది.
కాగా చెన్నైలోని కోడంబాకంలో సొంత రికార్డింగ్ స్టూడియోను నెలకొల్పాలని ఇళయరాజా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |