![]() |
![]() |

ఇదివరకు జాన్వీ కపూర్ టైటిల్ పాత్రధారిగా కరణ్ జోహార్ నిర్మించిన 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గాళ్' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేసి, కోర్టుకెక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. లేటెస్ట్గా మరో నెట్‌ఫ్లిక్స్ మూవీ 'ఏకే వర్సెస్ ఏకే'పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఆ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులో అనిల్ కపూర్ ధరించిన ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ సరిగ్గా లేదని అభ్యంతరం చెప్పిన ఐఏఎఫ్, ఒక సంభాషణలో ఆయన వాడిన పదజాలంపైనా మండిపడింది.
ట్రైలర్లో, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గెటప్‌లో అనిల్ కపూర్ ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లు చూపించారు. ఆ తర్వాత ఆయన కూతురు సోనమ్ కపూర్‌ను కాపాడుకోవడానికి పది గంటల సమయం మాత్రమే ఉందని చెప్పిన అనురాగ్ కశ్యప్‌ను కలుసుకున్నారు. అనేక అడ్డంకుల్ని దాటుకుంటూ, అనురాగ్‌తో ఫైట్ చేసి, సోనమ్ ఎక్కడుందో కనిపెట్టడానికి కొన్ని పరుష మాటలు మాట్లాడతారు అనిల్. దీనిపై ట్వీట్ చేసిన ఐఏఎఫ్, ఆ సీన్లను తొలగించాల్సిందిగా డిమాండ్ చేసింది.
'ఏకే వర్సెస్ ఏకే' ట్రైలర్‌ను షేర్ చేసిన అనిల్ కపూర్ ట్వీట్‌ను రిట్వీట్ చేసిన ఐఏఎఫ్, "ఈ వీడియోలో ఐఏఎఫ్ యూనిఫామ్ సరిగా లేదు. ఉపయోగించిన భాష సక్రమంగా లేదు. భారత సాయుధ దళాల్లో వ్యవహరించే తీరుకు ఇది విరుద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన సీన్లను తొలగించాల్సిన అవసరం ఉంది" అని అది రాసుకొచ్చింది.

దీనిపై అనిల్ కపూర్ స్పందించారు. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియోలో, ఎవరి మనోభావాలనూ గాయపరిచే ఉద్దేశం తనకు కానీ, నిర్మాతలకు కానీ ఎప్పుడూ లేవని ఆయన చెప్పారు. తన కూతుర్ని అన్వేషించే క్రమంలో ఐఏఎఫ్ యూనిఫామ్ ధరించి, అలా మాట్లాడతాడని ఆయన వివరించారు.
![]() |
![]() |