![]() |
![]() |

'బాహుబలి' సినిమాతో టాలీవుడ్‌ను దేశంలోని ఇతర భాషా చిత్రసీమలు చూసే దృష్టి సమూలంగా మారిపోయింది. తెలుగులో ఎలాంటి స్టార్లు, ఎలాంటి డైరెక్టర్లు ఉన్నారనే విషయం జాతీయ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్ దేశవ్యాప్తంగా కీర్తి పొందగా, 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్‌సింగ్'తో డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా హాట్ డైరెక్టర్‌గా మారిపోయాడు. వివిధ అంశాలపై అతను చేసిన వ్యాఖ్యలు కూడా అతడి పాపులారిటీని మరింత పెంచాయి. ఇప్పుడు సందీప్‌రెడ్డి తరహాలోనే మరికొంతమంది డైరెక్టర్లకు బాలీవుడ్ ఆహ్వానం పలుకుతోంది. వారిలో ఇద్దరు డైరెక్టర్లు తమ టాలెంట్‌ను చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
తెలుగులో సుమంత్ హీరోగా నటించిన 'మళ్లీ రావా' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై విమర్శకుల్ని ఇంప్రెస్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. రెండో సినిమాతో అయితే ఏకంగా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. నాని హీరోగా నటించిన ఆ సినిమా 'జెర్సీ'. క్రికెట్‌ను జీవితంగా భావించే ఒక క్రికెటర్ అనివార్యంగా దాన్ని వదిలేయాల్సి వచ్చి, తిరిగి ఒక ప్రయోజనం కోసం క్రికెట్ ఆడే కథతో రూపొందిన ఆ సినిమా ఇటు ప్రేక్షకుల్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించింది. అంతే కాదు, 'కబీర్‌సింగ్'గా నటించి కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్‌ను సాధించిన షాహిద్ కపూర్ ఈ సినిమా చూసి, గౌతమ్ డైరెక్షన్‌లో రీమేక్ చేసేందుకు అంగీకరించాడు. 'జెర్సీ' పేరుతో ఇప్పటికే సెట్స్ మీదున్న ఈ సినిమా 2021 ఆరంభంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మూవీతో గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్‌లోనూ తన ప్రతిభను నిరూపించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నాని ప్రొడ్యూస్ చేసిన 'హిట్' సినిమాతో టాలీవుడ్‌లోని అందరి దృష్టినీ ఆకర్షించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. విష్వక్‌సేన్‌ను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజుగా చూపిస్తూ అతను తీసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. తొలి సినిమాలోనే అతడి స్క్రీన్‌ప్లేకి చాలామంది ఆశ్చర్యపోయారు. శైలేష్ తండ్రి టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దగ్గర ఉద్యోగి. నిజానికి దిల్ రాజు ప్రొడక్షన్‌లోనే డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పటికీ రాజు మొదట లైట్ తీసుకోవడంతో నాని బ్యానర్ నుంచి పరిచయమయ్యాడు శైలేష్. ఇప్పుడు అతడి టాలెంట్‌ను గుర్తించిన రాజు నేరుగా అతడికి హిట్ హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కల్పించాడు. రాజ్‌కుమార్ రావ్ వంటి నటుడితో 'హిట్'ను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు శైలేష్. అక్కడ కూడా అతడికి హిట్ గ్యారంటీ అని నమ్మవచ్చు.
![]() |
![]() |