![]() |
![]() |

నాలుగంటే నాలుగు సినిమాలు తీసి టాప్ లీగ్ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. ఆ నాలుగు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించాయి. ప్రభాస్ సూపర్ హిట్ మూవీ 'మిర్చి'తో డైరెక్టర్‌గా మారిన ఈ రైటర్, ఆ తర్వాత 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్' అనే నేను సినిమాలు రూపొందించాడు. ఇవి ఆయా సందర్భాల్లో ఆ హీరోలకు హయ్యెస్ట్ గ్రాసర్స్ కావడం మరో విశేషం. 'భరత్ అనే నేను' మూవీ తర్వాత రెండేళ్ల విరామంతో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తూ 'ఆచార్య' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు కొరటాల.
కాగా కొరటాల శివకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. 'శ్రీమంతుడు' సినిమా విడుదల సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ నటన గురించి కొరటాల చేసిన కామెంట్స్ ఆసక్తిని కలిగించడమే కాకుండా చర్చనీయాంశమయ్యాయి. "నేను పరిశీలించినంత వరకు మహేశ్ మన కాలపు ఉత్తమ నటుల్లో ఒకరు. ఆయన పర్ఫెక్షనిస్ట్. ఆమిర్ ఖాన్ కంటే బెటర్ పర్ఫెక్షనిస్టుని ఆయనలో చూశాను" అని మహేశ్‌ను ఆకాశానికెత్తేశాడు కొరటాల. బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్‌ను పర్ఫెక్షనిస్ట్‌గా పరిగణించే విషయం సినీ ప్రియులకు తెలిసిందే. అలాంటి ఆయన కంటే మహేశ్ బెటర్ పర్ఫెక్షనిస్ట్ అని అభివర్ణించడం చిన్న విషయమేమీ కాదు.
'శ్రీమంతుడు'లో మహేశ్ అభినయం అందరి హృదయాలనూ దోచుకున్న విషయం, అందులో మహేశ్ సైకిల్ తొక్కుతూ కనిపించడంతో ఆ రోజుల్లో అనేకమంది సైకిళ్లను కొని దగ్గర దూరాలకు వాటిని ఉపయోగిస్తూ రావడం కాదనలేని నిజం. అది సరే.. మరిప్పుడు కొరటాల మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ను మెగాస్టార్‌గా ఏలిన చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆయనను 'ఆచార్య' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చూపిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవి గురించి కొరటాల ఎలాంటి కామెంట్ చేస్తాడు, నటుడిగా ఆయనకు ఎలాంటి బిరుదు ఇస్తాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పర్ఫెక్షనిస్ట్ కంటే ఉత్తమ బిరుదు ఏముంటందబ్బా!!
![]() |
![]() |