![]() |
![]() |

సినిమా పేరు: ఫోరెన్సిక్
తారాగణం: టొవినో థామస్, మమతా మోహన్‌దాస్, రెబా మోనికా జాన్, గిజు జాన్, ప్రతాప్ పోతన్, రెంజి పణిక్కర్, రోనీ డేవిడ్, సైజు కురుప్, ధనేష్ ఆనంద్, తమన్నా ప్రమోద్
స్టోరీ, స్క్రీన్‌ప్లే: అఖిల్ పాల్, అనస్ ఖాన్
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్
ఎడిటింగ్: షమీర్ మహమ్మద్
నిర్మాతలు: నేవిస్ జేవియర్, సిజు మాథ్యూ
దర్శకత్వం: అఖిల్ పాల్, అనస్ ఖాన్
డ్యురేషన్: 134 నిమిషాలు
ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
రేటింగ్: 3.25/5
2020లో మలయాళంలో వచ్చిన సినిమాల్లో టాప్ అనదగ్గ కొన్ని సినిమాల్లో 'ఫోరెన్సిక్' ఒకటి. సీరియల్ కిల్లింగ్ నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్‌గా తయారైన ఈ మూవీతో అఖిల్ పాల్, అనస్ ఖాన్ జోడీ దర్శకులుగా పరిచయమవడం గమనార్హం. మలయాళంలోని టాలెంటెడ్ యంగ్ యాక్టర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన టొవినో థామస్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో మనకు బాగా తెలిసిన మలయాళీ తార మమతా మోహన్‌దాస్ ఓ కీలక పాత్రలో దర్శనమిస్తుంది.
కథ
చిన్న పిల్లలను.. అదీ అమ్మాయిలను టార్గెట్ చేసుకొని వాళ్లను కిడ్నాప్ చేసి, హత్యలు చేస్తూ వస్తున్న సీరియల్ కిల్లర్‌ను పట్టుకొనే బాధ్యతను పై అధికారులు రితికా జేవియర్ ఐపీఎస్ (మమతా మోహన్‌దాస్)కు అప్పగిస్తారు. ఆమె టీమ్‌లో మెడికో లీగల్ అడ్వైజర్‌గా చేరతాడు శామ్యూల్ జాన్ (టొవినో థామస్). నిజానికి రితిక ఎవరో కాదు.. శామ్యూల్‌కు స్వయానా వదిన. కానీ భర్తతో వేరుపడి విడిగా జీవితం సాగిస్తుంటుంది రితిక. దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అందుకే శామ్యూల్ అంటే గిట్టకపోయినా అధికారులు అతడిని అడ్వైజర్‌గా నియమించడంతో రితికకు ఒప్పుకోక తప్పదు. కానీ తన ఫోరెన్సిక్ నైపుణ్యంతో శామ్యూల్ కనిపెట్టే అంశాలను ఆమె తేలిగ్గా తీసేస్తూ వస్తుంటుంది. శామ్యూల్ పరిశోధనలో ఒక దిగ్ర్భాంతికర నిజం బయటపడుతుంది. అదేమిటి? వరుస హత్యలు చేస్తున్న వ్యక్తి ఎవరు? చివరకు కథ ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుంది? అనేవి ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వెల్లడయ్యే విషయాలు.
విశ్లేషణ
నేటి డైరెక్టర్ల.. అందునా నవ దర్శకుల విజన్ ఏ స్థాయిలో ఉంటుందనేందుకు 'ఫోరెన్సిక్' మూవీ ఒక సూపర్బ్ ఎగ్జాంపుల్. ఈ మూవీని కొత్త దర్శకులు రూపొందించారంటే ఓ పట్టాన నమ్మలేం. అంత పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాని పరుగులు పెట్టిస్తారు. ఓటీటీలో కాబట్టి మన వెసులుబాటు కొద్దీ కొంచెం కొంచెంగా చూడొచ్చులే అనుకొనేవాళ్లు సైతం సినిమా ఓ పావుగంట గడిచాకా దానిలో లీనమైపోయి, చివరి షాట్ అయ్యేదాకా లేవరంటే.. 'ఫోరెన్సిక్'ను ఎంత గ్రిప్పింగ్‌గా దర్శకులు తీశారో ఊహించుకోవచ్చు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ఉంటుందీ, పరిశోధనలో లభించే అతి చిన్న వస్తువును ఆ ల్యాబ్‌లో పరీక్షించడం ద్వారా నేరాలకు సంబంధించి దాన్ని ఓ క్లూగా ఎలా మార్చుకోవచ్చు, ఎంత పకడ్బందీగా జరిగే నేరాన్నయినా దాని వెనుక ఉన్న మిస్టరీని ఎలా ఛేదించవచ్చు.. అనే విషయాలను ఈ సినిమాలో చూపించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. మనం అత్యంత అల్పమనుకున్న అంశాలను దర్శకులు ఎంత బాగా కథను నడపడంలో ఉపయోగించుకున్నారో చూస్తే.. ముచ్చటేస్తుంది. ట్విస్టులైతే స్టన్నింగ్‌గా అనిపిస్తాయి. హత్యలను హింసాత్మకంగా తెరపై ప్రెజెంట్ చేయకపోవడం దర్శకులు చేసిన మరో మంచి పని. మూవీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడవడంలో స్క్రీన్‌ప్లే ఎంత పెద్ద పాత్ర పోషించిందో, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా అంతటి పాత్రనే పోషించాయి.
నటీనటుల అభినయం
శామ్యూల్ జాన్‌గా టొవినో థామస్, రితికా జేవియర్‌గా మమతా మోహన్‌దాస్ పోటీపడి తమలోని అత్యుత్తమ స్థాయి నటనను వెలికి తీశారు. శామ్యూల్ కనిపెట్టే అంశాలను తేలిగ్గా తీసివేస్తూ అసహనాన్ని ప్రదర్శించే రితిక క్యారెక్టర్‌లో మమత నటనను చూడటం ఒక మంచి అనుభవం. ఆమె ఎంత అసహనంగా తన పట్ల ప్రదర్శిస్తున్నా సంయమనం కోల్పోకుండా ఓర్పుగా వ్యవహరిస్తూ, తన విధిని తాను చేసుకుంటూ పోయే శామ్యూల్ పాత్రలో టొవినో థామస్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. అతని పరిశోధనకు తోడ్పాటునందించే రెబా మోనికా జాన్, డాక్టర్ జయకుమార్ మీనన్‌గా ప్రతాప్ పోతన్, రితిక భర్త జేవియర్ జాన్‌గా సైజు కురుప్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రితిక కూతురు నయనగా తమన్నా ప్రమోద్ చూపిన అభినయం కూడా ప్రశంసించదగ్గదే.
తెలుగు వన్ పర్‌స్పెక్టివ్
థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనే సినిమా 'ఫోరెన్సిక్'. ఒక క్రైమ్ వెనుక మిస్టరీని ఛేదించడంతో ఫోరెన్సిక్ టెస్ట్ అనేది ఎంతగా ఉపకరిస్తుందో తెలియజేసే ఈ మూవీని తిలకించడం ఒక కొత్త అనుభూతి, ఒక కొంగొత్త అనుభవం.
- బుద్ధి యజ్ఞమూర్తి
![]() |
![]() |