![]() |
![]() |

రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లకు అనుమతులిచ్చేసినా టాలీవుడ్‌లో ఒకట్రెండు చిన్న సినిమాలు మినహా షూటింగ్‌లు పునఃప్రారంభం కాలేదు. షూటింగ్‌ల కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థించి మరీ అనుమతులు తెచ్చుకున్న టాలీవుడ్ పెద్దలు ఆ దిశగా ఇంతవరకూ అడుగు ముందుకు వెయ్యడం లేదు. కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటం, రోజుకు పదుల సంఖ్యలో వచ్చే కేసులు రెండు రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో వస్తుండటం వల్ల షూటింగ్‌లు కొనసాగించడానికి భయపడుతున్నారు. ఎక్కువ మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్‌లకు రావడానికి వెనుకాడుతుండటం వల్ల కూడా షెడ్యూల్స్ వేసుకోవడంలో దర్శక నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని ఆగస్ట్ నాటికి ఎలాగైనా షూటింగ్స్‌ను పునరుద్ధరించాలని వాళ్లు భావిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్', చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న 'ఆచార్య', పవన్ కల్యాణ్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ శ్రీరామ్ వేణు తీస్తున్న 'వకీల్ సాబ్', ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'ఓ డియర్' (పరిశీలనలో ఉన్న టైటిల్) అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తోన్న 'పుష్ప', విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ తీస్తున్న 'లైగర్' తదితర సినిమాల షూటింగ్‌లు ఆగస్ట్ నుంచి రెగ్యులర్‌గా జరిగేలా షెడ్యూళ్లు వేస్తున్నారు. అలాగే మహేశ్ కథానాయకుడిగా పరశురామ్ రూపొందించనున్న 'సర్కారు వారి పాట'ను సైతం ఆగస్ట్‌లో సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
![]() |
![]() |