![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల తర్వాత అతనిని మానసిక వేదనకు గురిచేసి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే అభియోగాలతో ఎనిమిది మంది పేరు పొందిన సినీ, టీవీ సెలబ్రిటీలపై ఒక లాయర్ కోర్టులో కేసు వేశారు. బిహార్‌లోని ముజఫర్‌నగర్ కోర్టులో ఈ కేసును సుధీర్‌కుమార్ ఓఝా అనే లాయర్ దాఖలు చేశాడు. ఆయన అభియోగం మోపిన వాళ్లలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, సాజిద్ నదియడ్‌వాలా, భూషణ్ కుమార్, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా వంటి ప్రముఖులు ఉన్నారు.
ఐపీసీ సెక్షన్లు 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 109, 504 (ప్రశాంతతకు భంగం కలిగిస్తూ ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష) కింద ముజఫర్‌పూర్‌లోని చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదును దాఖలు చేసినట్లు సుధీర్‌కుమార్ చెప్పారు. న్యూస్‌పేపర్లు, టీవీ చానళ్ల రిపోర్ట్ ప్రకారం బిహార్‌కు చెందిన రైజింగ్ స్టార్ సుశాంత్ సింగ్‌ను బాలీవుడ్ నుంచి బాయ్‌కాట్ చేశారనీ, దాదాపు 7 సినిమాల నుంచి అతన్ని తొలగింపచేశారనీ, పూర్తయిన సినిమాలను విడుదల కాకుండా ఆపుతున్నారనీ ఆయన తెలిపారు.
ఆఖరుకి వివిధ కార్యక్రమాల్లో భాగం కాకుండా చేయడానికి అతడిని ఆహ్వానించడం లేదనీ, అతను సూపర్‌స్టార్ కాకుండా నిరోధించడానికి వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించారనీ సుధీర్‌కుమార్ అన్నారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదనీ, అది హత్య అనీ ఆయన ఆరోపించారు. తన ఫిర్యాదును కోర్టు సీరియస్‌గా పరిగణనలోకి తీసుకొని, జూలై 3వ తేదీ విచారించనున్నదని ఆయన తెలిపారు.
![]() |
![]() |